నిర్మల్ అర్బన్ : నిరుద్యోగులు భగ్గుమన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ సోమవారం నిర్మల్‌లో ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యావంతులు, నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి చంద్రప్రకాశ్‌కు వినతిపత్రం అందజేశారు.
నిర్ణయం మానుకోవాలి
ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మిమెంట్ చేస్తే అనేక మంది విద్యావేత్తలు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు కేసీఆర్ నిర్ణయంతో నిరాశ చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు పులి అశోక్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు రవికుమార్, లింగయ్య, అరుణ్, కల్యాణ్, రవి, కాంతరావు తదితరులున్నారు.
క్రమబద్ధీకరణపై విధివిధానాలు లేకే ఆందోళనలు
ఎదులాపురం : కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలు ప్రకటించకపోవడంతోనే నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొందని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు జేఎల్ గౌతం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2007 వరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం స్పష్టత ఇవ్వని కారణంగా విద్యార్థులకు అనుమానాలు తలెత్తుతున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. జిల్లాలో ఎంఈవోలను నియమించాలని, విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని, బెల్లంపల్లిలో పెండింగ్‌లో ఉన్న మెడికల్ కళాశాలను వెంటనే నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీని ఉట్నూర్‌లోనే నెలకొల్పాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.తిరుపతి, పసుల చంటి, ఉపాధ్యక్షులు సంగరి వెంకటేశ్, పాపారావు, కోశాధికారి అర్క శ్రీనివాస్, నాయకులు ప్రశాంత్, చరణ్, రాహుల్ పాల్గొన్నారు.
భగ్గుమన్న నిరుద్యోగులు
Published Tue, Jul 29 2014 1:07 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement