సమీపిస్తున్న మేడారం జాతర
విడుదలైన నోటిఫికేషన్
గడువు ముగిసినా ఖరారు కాని సభ్యులు
ట్రస్టుబోర్డు లేకుండానే గత జాతర నిర్వహణ
ప్రభుత్వ నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం
హన్మకొండ రెండేళ్లకు ఓసారి జరిగే మేడారం జాతర 2016 ఫిబ్రవరిలో జరగనుంది. ఈ జాతరకు సంబంధించిన ట్రస్టుబోర్డును నియమించేందుకు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయశాఖ అధికారులు 2015 జూలై రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఇరవై రోజులలోపు ఆసక్తి ఉన్న వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించి తుది జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది. గడువు ముగిసినా నేటికి ట్రస్టుబోర్డు నియామకానికి సంబంధించి అడుగు ముందుకు పడలేదు. నిబంధనల ప్రకారం ట్రస్టుబోర్డులో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండాలి. వీరిలో కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఉండాలి. ఒకరు మహిళా సభ్యురాలు తప్పనిసరి. రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడితో ట్రస్టుబోర్డు సభ్యుల నియామకంపై జాప్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల్లో ఎవరికి ట్రస్టుబోర్డులో స్థానం కల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఆలస్యం చోటు చేసుకుంటుంది. గత జాతర సమయంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొనడంతో ట్రస్టుబోర్డు లేకుండానే జాతరను నిర్వహించారు. జాతర సందర్భంగా పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
ఇబ్బందులు తెలుస్తాయి
దాదాపు కోటిమందికి పైగా భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహాణ ఏర్పాట్లు ఆర్నెళ్ల ముందు నుంచి ప్రారంభమవుతాయి. వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ జాతర సంప్రదాయాలు, భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు జాతర ట్రస్టుబోర్డు కీలక పాత్ర పోషిస్తుంది. ట్రస్టుబోర్డు ఎస్సీ, ఎస్టీ, మహిళా సభ్యులు కచ్చితంగా ఉండటం వల్ల అన్ని వర్గాలకు చెందిన భక్తుల అభిప్రాయాలు వెల్లడయ్యే వీలుంటుంది. భక్తుల సౌకర్యం పేరుతో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టే పనుల్లో ప్రజాభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన దశాబ్ధ కాలంగా ప్రతీ మేడారం జాతర సందర్భంగా ట్రస్టుబోర్డును ఏర్పాటు చేస్తున్నారు. కానీ 2014 జాతర సందర్భంగా ట్రస్టుబోర్డును నియమించకపోవడంలో పలు సమస్యలు తలెత్తాయి. భక్తులు సమర్పించే తలనీలాలు నామినేషన్ లేదా టెండర్ విధానం నిర్వహించాలనే అంశంపై చివరి వరకు ఉత్కంఠ నెలకొంది.
చివ రకు ఈ వ్యవహారం దేవాదాయశాఖ, వడ్డేలకు మధ్య ప్రచ్ఛన్న యుద్దానికి దారి తీసింది. అదేవిధంగా గద్దెల చుట్టూ ఏ ప్రాంతం వద్ద భక్తులకు ప్రసాదం అందించాలనే అంశంపై స్పష్టత రాలేదు. చివరి నిమిషంలో ప్రసాదం కోసం కేటాయించిన స్థలం కారణంగా క్యూలైన్ల వేగం తగ్గిపోయింది. దానితో రెండు రోజుల తర్వాత ప్రసాదం కేంద్రాలను ఎత్తివేశారు. ఆలయ ప్రాంగణం చుట్టూ దుకణాసముదాయాల కోసం కేటాయించిన స్థలాలను చివరి నిమిషంలో రద్దు చేశారు. దానితో ఎక్కువ ధర చెల్లించి స్థలాలు పొందిన వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జాతర ట్రస్టుబోర్డు జాడలేదు
Published Sat, Sep 26 2015 5:39 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement
Advertisement