- డిప్యూటీ ఈఓలకు హైదరాబాద్ డీఈఓ ఆదేశం
సాక్షి, సిటీబ్యూరో : కనీస వసతులు కల్పించని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటినీ మూసివేయాలని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సోమిరెడ్డి అధికారులను ఆదేశించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల స్థితిగతులపై ఆయా డివిజన్ల ఉప విద్యాశాఖాధికారులు, ఉప పర్యవేక్షకులతో డీఈఓ సమీక్షించారు.
హైదరాబాద్ జిల్లాలో 176 ప్రభుత్వ పాఠశాలలకు మంచినీటి వసతి లేదని ఆర్వీఎం అధికారులు నివేదిక సమర్పించినట్లు చెప్పారు. ఇందులో 96 పాఠశాలలకు వారంలోగా నీటి కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారని, మిగిలిన 80 పాఠశాలలకు మినరల్ వాటర్ అందజే సేందుకు ఆర్వీఎం సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. మరుగుదొడ్లు లేని ఏడు పాఠశాలల్లో తక్షణం వాటిని నిర్మించేందుకు ప్రభుత్వ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
డివిజన్ల వారీగా తాగునీరు, మరుగుదొడ్లు లేని స్కూళ్ల నివేదికను సమర్పించాలని డిప్యూటీ ఈఓలకు, ఐఓఎస్‌లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు నిమిత్తం త్వరలోనే రేషనలైజేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ ఈఓలు సుశీంద్రరావు, వెంకటేశ్వర్లు, చిరంజీవి, బాలునాయక్, ఝాన్సీ, డిప్యూటీ ఐఓఎస్‌లు వేణుగోపాలాచారి, పిచ్చ య్య పాల్గొన్నారు.