సిటీలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మరీ ముఖ్యంగా పచ్చిమిర్చి రేటు మూడు రోజుల్లోనే రెట్టింపైంది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.80కు విక్రయిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రూ.10 కిలో ఉన్న టమాటా రూ.30కి చేరింది. బెండ, దొండ, బీన్స్, బీరకాయ ధరలు కిలో రూ.40 దాటాయి. దీంతో మధ్య తరగతి జనం బెంబేలెత్తుతున్నారు. గ్రేటర్ ప్రజల అవసరాలకు తగినట్లుగా శివార్లలో కూరగాయల సాగు ఉండడం లేదు. దీంతో అన్నీ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానే రేట్లు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది పచ్చిమిర్చి సాగు బాగా తగ్గిందని అందుకే ధర రెట్టింపైందని పేర్కొంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో
బాబోయ్ ఇవేం ధరలు. వేసవిలో ఎండలతో పాటు కూరగాయలూ మండుతున్నాయి. ధరలు కుతకుత ఉడుకుతూ సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. పచ్చిమిర్చి మిరామిరామంటోంది. బీన్స్ బెంబేలెత్తిస్తోంది. చిక్కుడు చికాకెత్తిస్తోంది. ఇలా ఒక కూరగాయని ఏమిటి అన్నీ తామేం తక్కువ తినలేదని తార పథానికి దూసుకుపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే కాయగూరల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతోంది. గడచిన వారం రోజుల్లో కూరగాయల ధరలు రెట్టింపు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మే నెలలోనే ఇలా ఉంటే ఇక జూన్, జూలై నెలల్లో ధరలు ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన సగటు జీవుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో
ఈ నెల మొదటి వారంలో టమాటా కిలో 15 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ.30కి ఎగబాకింది. వంకాయ రూ.15 నుంచి రూ.50 చేరింది. బెండకాయ రూ.30 ఉంటే ప్రస్తుతం రూ.60 అయింది. దొండకాయ పరిస్థితి ఇలాగే ఉంది. బీరకాయ రూ.40 నుంచి రూ.80కి చేరింది. బీన్స్, చిక్కుడు ధరలు శతకానికి చేరువలో ఉన్నాయి. రెండు మూడు రోజుల క్రితం కిలో రూ.30– 40 ఉన్న కిలో పచ్చిమిర్చి సోమవారం రూ. 80కి ఆకాశాన్నంటింది. ఇలా కూరగాయల ధరల పరిస్థితి నెలకు అవతల, నెలకు ఇవతల డబులై కూర్చున్నాయి. దీంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండిపోతున్న ధరలు కేవలం కొనుగోలుదారులనే కాదు అమ్మకపుదారులను కూడా కష్టాల్లోకి నెట్టేస్తోంది. పావుకిలో కూడా కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అంటూ సాధారణ కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తంచేస్తుంటే.. ఏం అమ్మేటట్టు లేదు ఏం మిగిలేటట్టు లేదు అని కూరగాయల అమ్మకందారుల చెబుతున్నారు.
పచ్చిమిర్చి ఘాటుకు కారణమిదే..
నగర ప్రజల పచ్చిమిర్చి అవసరాలు తీర్చడానికి శివారు ప్రాంతాల నుంచి మిర్చి దిగుమతి అవుతోంది. ఇటీవల అకాల వర్షాలతో మిర్చి పంటకు తీవ్ర ఇష్టం జరిగింది. దీంతో మిర్చి సరఫరా తగ్గిందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నగరానికి మిర్చి సరఫరాల తగ్గింది. నగరానికి రోజు దాదాపు 12 వందల నుంచి 15 వందల క్వింటాళ్ల మిర్చి అవసరం. సోమవారం నగరానికి కేవలం సుమారు 850 క్వింటాళ్ల మిర్చి మాత్రమే వివిధ హోల్‌సేల్ మార్కెట్‌లకు దిగుమతి అయింది. మిర్చి తక్కువగా దిగుమతి అవడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో మిర్చి క్వింటాల్ ధర రూ.5 వేల నుంచి రూ.6వేలు పలుకుతోంది.
తగ్గిన స్థానిక దిగుమతులు..
మార్కెట్‌కు ప్రస్తుతం పెద్ద మొత్తంలో టమాటా మాత్రమే దిగుమతి అవుతోంది. ఈ ఏడాది నగర శివారు జిల్లాలైన వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ రైతలు టమాటా పండించటంతో ఎక్కువగా దిగుమతి అయ్యేవి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా టమాటా దిగుమతులు ఎక్కువగా ఉండడంతో వీటి ధర కిలో రూ30 దాటలేదు. కాగా.. టమాటాతో పాటు మిగతా కూరగాయలు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్ర్‌రాల నుంచి దిగుమతి చేసుకోవడంతోనే ధరలు పెరుగుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.
డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదు
గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా దాదాపు కోటిమంది. వీరికి ప్రతి రోజు దాదాపు 3 వేల టన్నుల వివిధ రకాల కూరగాయలు వినియోగమవుతున్నాయి. ప్రతి ఒక్కరికి 300 గ్రాముల కూరగాయలు అవసరం. వేసవి ఆఫ్ సీజన్‌లో నగర ప్రజల 70 శాతం కూరగాయల అవసరాలు ఇతర రాష్ట్రాల దిగుమతులతో పూర్తవుతాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా కూరగాయలు మార్కెట్‌కు రాకపోవడంతో ధరలు మండుతున్నాయి.
దిగుబడులు తగ్గడంతో ధరలు పెరిగాయి..
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు ఆలస్యంగా పెరిగాయి. ఇందుకు కారణం వర్షాలు డిసెంబర్ వరకు కురిశాయి. స్థానికంగా కూరగాయల దిగుమతులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల నుంచి మిర్చి, కూరగాయల దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి.
– కె. శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్
Comments
Please login to add a commentAdd a comment