వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల పనితీరు ఇంకా మారనేలేదు. సరిగ్గా నెలరోజుల క్రితం వివిధ విభాగాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ తర్వాత ఆలయ పర్యవేక్షకుడు రాజేందర్ నివాసాలపై ఏసీబీ అధికారులు మూకుమ్మడి దాడులు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు సోదాలు చేసిన నిఘా విభాగం.. రాజన్న ఆలయ అధికారులు, ఇన్‌చార్జీల నుంచి వివరాలు రాబట్టేందుకు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అయినా, కొందరు ఉద్యోగులు దాందా సాగించడం విస్మయానికి గురిచేస్తోంది.
శుక్రవారం రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీనిని ఆసరా చేసుకున్న స్పెషల్ కోడెల టికెట్ కౌంటర్‌లోని సిబ్బంది.. కోడెల టికెట్లపై లడ్డూ ప్రసాదం ఇవ్వకుండా నొక్కేశారు. కేవలం టికెట్లు మాత్రమే భక్తుల చేతికి ఇచ్చి దందా సాగించారు. రూ.200 విలువైన టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వాల్సి ఉన్నా.. ఆపని చేయకుండా సిబ్బంది తమ జేబులో వేసుకున్నారు.
స్పెషల్ కోడె భక్తులకు టికెట్‌పై ఇచ్చే ఉచిత లడ్డూను కౌంటర్ సిబ్బంది రీసైక్లింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇండెంట్ ప్రకారం ప్రసాదాల గోదాం నుంచి స్పెషల్ టికెట్ల సంఖ్యకు అనుగుణంగా లడ్డూలు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగతా ప్రసాదాల విభాగానికి లడ్డూలు అందజేస్తారు. ఈక్రమంలో భక్తులకు ఇవ్వని ఉచిత లడ్డూ ఎక్కడికి వెళ్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సమ్మక్క– సారలమ్మ జాతర సమీపిస్తోంది. ఈక్రమంలో రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు వేలసంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీ దృష్ట్యా స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని వెనువెంటనే తిరుగుపయనమవుతున్నారు. ఈక్రమంలో రూ.200 విలువైన స్పెషల్ కోడె టికెట్‌ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈటికెట్ ఇచ్చే కౌంటర్ ఒకచోట ఉంటే... టికెట్‌పై ఉచితంగా ఇచ్చే లడ్డూ ప్రసాదం కౌంటర్‌ను మరోచోట ఏర్పాటు చేశారు. ఈవిషయం తెలియని భక్తులు.. లడ్డూ తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. అయితే రూ.100 కోడె టికెట్లు ఇచ్చిన చోటనే లడ్డూ ప్రసాదం అందించడం గమనార్హం. కొందరు భక్తులు మాత్రం ఇదేమిటని ప్రశ్నిస్తే.. ప్రచార శాఖలో లడ్డూలు ఇస్తున్నారని ఆ తర్వాత సిబ్బంది చెప్పడం గమనార్హం.
జెల్ది ఇంటికి పోదామని రెండువందల రూపాయల కోడెల టికెట్టు దీసుకున్నం. దీనిమీద ఉచితంగా లడ్డూ ఇస్తమని రాసిండ్రు. దీనిగురించి కౌంటర్ల అడిగితే.. అక్కడిత్తరని, ఇక్కడిత్తరని జెప్పిం డ్రు. ఎక్కడ తిరిగినా లడ్డూ ఇయ్యలే. మాలాంటోళ్లను గిట్ల గోసవెట్టుడు మంచిదిగాదు. అధికారులు స్పందించి అందరికీ లడ్డూలు ఇప్పించాలె.
– రామవ్వ, భక్తురాలు, నర్సంపేట
ఇండెంట్ ప్రకారం లడ్డూలు
మాకు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం కౌంటర్లకు లడ్డూలు అందజేస్తాం. అక్కడివారు వాటిని ఏం ఎలా పంపిణీ చేస్తున్నారో మాకు తెలియదు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు వేరు. మేం కేవలం లడ్డూలు అందిస్తాం. అయితే కోడెల టికెట్ ఇచ్చే కౌంటర్ వద్ద కాకుండా మరోచోట ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారట. అలాగే ప్రచారశాఖలోనూ లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్నారు. కానీ భక్తులకు ఇది అందుబాటులో లేదు. ఉన్నతాధికారులు దీనిపై చర్య తీసుకోవాలి.
– రాజేశం, ప్రసాదాల గోదాం ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment