సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్.. ఉదయం 7.45.. వికారాబాద్‌కు వెళ్లే ప్యాసింజర్ రైలు బయలుదేరింది. క్యాబిన్‌లో లోకోపైలట్ సీటులో ఓ మహిళ, సహాయంగా అసిస్టెంట్ లోకోపైలట్‌గా మరో మహిళ పరుగుపెట్టిస్తున్నారు. ఇంతలో బోగీల్లోకి టికెట్లు చెక్ చేసేందు కు ముగ్గురు టీటీఈలు వచ్చారు. వారంతా మహిళలే, రక్షణగా ఉన్న పోలీసు సిబ్బంది గస్తీకోసం బోగీల్లోకి వచ్చారు వారూ మహిళా సి బ్బందే. చివరలో ఉండే గార్డు క్యాబిన్‌లో విధు లు నిర్వహించిందీ స్త్రీమూర్తే. రైలును నడపటం క్లిష్టమైన ప్రక్రియే అయినా.. అత్యం త సులభంగా వారంతా నడిపి చూపించారు.
మహిళా సాధికారత, లింగసమానత్వం చాటడానికి భారతీ య రైల్వే ఈనెల 1 నుంచి 10 వరకు ‘ఈచ్ ఫర్ ఈక్వల్’నినాదంతో అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అధికారు లు శనివారం సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ వరకు ప్యాసింజర్ రైలును పూర్తిగా మహిళా ఉద్యోగుల చేత నడిపించారు. లోకోపైలట్ సరిత మేశ్రమ్, అసిస్టెంట్ లోకో పైలట్ మమత కుమారి, గార్డ్ వినీష, టీటీఈలు మంగ, కరిష్మ, పావన, ఎస్‌పీఎఫ్/ఆర్‌పీఎఫ్ నసీమాబేగం, నిరోషా విధుల్లో పాల్గొన్నారు. ఈ రైలును సికింద్రాబాద్ డివిజన్‌కు చెందిన మహిళా అధికారులు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మే నేజర్ గజానన్ మాల్యా రైలు నడిపిన మహిళా ఉద్యోగులందరినీ అభినందించారు. లింగ భేదం లేకుండా వారందరికీ దక్షిణ మధ్య రైల్వే సమానావకాశాలు కల్పిస్తోందన్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా వ్యవహరిస్తామన్నారు. దక్షిణ మధ్య రైల్వే ‘మహిళా రైల్వే స్టేషన్లు’ఏర్పాటు చేసి అం దరూ మహిళలే పనిచే సే 5 రైల్వే స్టేషన్లను విజయవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. బేగం పేట్, విద్యానగర్, చంద్రగిరి, న్యూ గుం టూర్, రామవరప్పాడు స్టేషన్లు వారి ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయని ఆయన చెప్పారు.
మహిళలే రైలును నడపటం ఆనందంగా ఉందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేయగా, తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా రైలును నడిపి చూపించామని విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పేర్కొన్నారు. అటు వికారాబాద్ వరకు, తిరిగి సికింద్రాబాద్‌కు రైలును వారు నడిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో భవిష్యత్తులో దీన్ని వీలునుబట్టి కొనసాగించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment