ఈ-పంచాయతీ | village ruling integration with internet | Sakshi
Sakshi News home page

ఈ-పంచాయతీ

Published Wed, Jul 23 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

village ruling integration with internet

మందమర్రి రూరల్ : గ్రామాల అభివృద్ధే లక్ష్యంతో దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. గ్రామ పాలన ను అంతర్జాలానికి అనుసంధానం చేస్తోంది. మారుమూల గ్రామాల్లోనే పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ-పాలనను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా పంచాయతీలను ప్రపంచంతో అనుసంధానం చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 8,778 గ్రామ పంచాయతీలకు గాను.. 2చ440 పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

 ఇందుకు కావాల్సిన మార్గదర్శకాలనూ సూచించింది. అందులో భాగంగా జిల్లాలో మొత్తం 866 గ్రామ పంచాయతీలకు గాను వీటిని 580 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక క్లస్టర్ కింద రెండు లేదా మూడు పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం 145 క్లస్టర్ల పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా చకాచకా సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాకు కంప్యూటర్లు కూడా చేరుకున్నాయి. బీఎస్‌ఎన్‌ల్ ద్వారా ఇంటర్‌నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. జిల్లాలోని మూడు డివిజన్లలో మొదటిసారిగా ఈ-పంచాయతీ పాలన అమలులోకి రానుంది. ఎంపిక చేసిన 145 క్లస్టర్ పంచాయతీలలో ఆదిలాబాద్ డివిజన్‌లో 51, ఆసిఫాబాద్ డివిజన్‌లో 34, నిర్మల్ డివిజన్‌లో 60 పంచాయతీలకు కంప్యూటర్లు ఇవ్వనున్నారు.

 145 కంప్యూటర్ల పంపిణీ..
 ఈ-పంచాయతీల కోసం జిల్లాకు 145 కంప్యూటర్లు మంజూరయ్యాయి. వీటిని జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యలయాలకు ఒకటి చొప్పున, జిల్లా పరిషత్ కార్యాలయాలకు రెండు, డివిజన్ స్థాయి కార్యాలయాలకు ఒకటి చొప్పున పంపిణీ చేశారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ డివిజన్లలో, డీపీవో కార్యాలయంలో, 52 మండల పరిషత్‌లలో కంప్యూటర్లు పంపిణీ చేశారు. ఎంపికైన పంచాయతీలకు ఈ కంప్యూటర్లు పంపిణీ చేయాల్సి ఉంది. కంప్యూటర్ల పంపిణీ అనంతరం బీఎస్‌ఎన్‌ల్ ఇంటర్‌నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు.

 గతంలో ఏడింటిలో ‘ఈ’ పాలన
 గతంలోనూ జిల్లా వ్యాప్తంగా ఏడు పంచాయతీలను ఎంపిక చేశారు. ఇచ్చోడ, ఉట్నూర్, ముథోల్, బాసర, ఆసిఫాబాద్, క్యాతన్‌పల్లి, నస్పూర్‌లలో ఈ పాలన సాగుతోంది. ప్రస్తుతం ఉన్న ఏడు, ఇప్పుడు మంజూరైన 145 గ్రామ పంచాయతీలతో కలిపి జిల్లాలో 152 పంచాయతీలలో ఈ-పాలన సాగనుంది.

 ఇక ప్రభుత్వ సేవలు అందుబాటులోకి..
 ఈ- పాలనాలో అన్ని ప్రభుత్వ సేవలు పారదర్శకంగా నిర్వహించనున్నారు. పంచాయతీలకు ఆదాయం ఎలా వ చ్చింది. ఎంత ఖర్చు చేశారనే వివరాలను ఆన్‌లైన్‌లో ఉం చుతారు. ఎలాంటి దాపరికం లేకుండా గ్రామపాలన సాగే అవకాశం ఉంది. అధికారులు ఎలాంటి అవకతవకులకు పాల్పడే వీలులేకుండా పోతుంది. అంతే కాకుండా గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని రకాల పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల పంపిణీ కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ప్రభుత్వం నుంచి విడుదల అయ్యే ప్రతి పైసా లెక్క ఉం టుంది. ఈ- పాలనలో ప్రస్తుతం కొన్ని కార్యక్రమాలనే చే పడుతున్నారు. విజయవంతమైతే మీ-సేవలో పొందే ప్ర తీ సేవలను పొందొచ్చు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, అంగన్‌వాడీ కార్యకర్త, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపా టు మరికొందరిని భాగస్వాములను చేసే అవకాశం ఉంది.

 కంప్యూటర్లు పంపిణీ చేయాల్సి ఉంది..  - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్
 ప్రస్తుతం క్లస్టర్ పంచాయతీలకు కంప్యూటర్లు పంపిణీ చేయాల్సి ఉంది. కొన్ని ప్రాంతాలలో బీఎస్‌ఎన్‌ఎల్ సిగ్నల్ ఉంది. లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం సర్వే నడుస్తోంది. అది పూర్తి కాగానే కంప్యూటర్లు పంపిణీ చేస్తాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement