
హక్కులను కాలరాస్తున్న కేంద్రం
హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మేడే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతోపాటు మతోన్మాద చర్యలకు పాల్పడుతోందన్నారు. కార్పొరేట్, మతోన్మాద శక్తులు కలసి రాజ్యాన్ని ఏలుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని పోరాడాల్సిన అవసరముందన్నారు.
హక్కుల సాధనకు పోరుబాట
మేడే సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, మేడే స్ఫూర్తితో దీనికి వ్యతిరేకంగా దీక్షపూని పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు, తర్వాత చేసిన వాగ్దానాలను అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, జ్యోతి, బి. వెంకట్, సాగర్, జాన్‌వెస్లీ, ఎస్.రమ, చంద్రారెడ్డి పాల్గొన్నారు.