
టీఆర్‌ఎస్‌లోకి ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఆదిలాబాద్ జిల్లా ముథోల్ శాసనసభ్యుడు విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా వేసుకోనున్నారు. ఆయనతోపాటు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ నుంచి మరిన్ని వలసలుంటాయని టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరేందుకు రహస్య మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. వీరిలో ఒకరు మహబూబ్‌నగర్, మరొకరు ఖమ్మం జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. అలంపూర్ ఎమ్మెల్యే వి.సంపత్ టీఆర్‌ఎస్‌లో చేరతారని ఇప్పటికే బాగా ప్రచారం జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా అలంపూర్ జోగులాంబ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలకు సంపత్ హాజరుకావడం దీనికి బలం చేకూరుస్తోంది. సంపత్ మాత్రం తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది.