చేవెళ్ల రూరల్: అప్పుల బాధ తాళలేక ఓ ప్రైవేట్ పాఠశాల వాచ్‌మన్ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెద్దనందిపాడు గ్రామానికి చెందిన జి. వరప్రసాద్ కొంతకాలంగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. పదిహేనేళ్ల క్రితం కుటుంబంతో సహా చేవెళ్లకు వలస వచ్చాడు. ఇటీవలే చేవెళ్లలో కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. వరప్రసాద్‌కు భార్య ప్రమీల, కూతుళ్లు శ్వేత, అనూషలు ఉన్నారు.
కుటుంబ పోషణకు, ఇంటి నిర్మాణానికి ఆయన తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వాటికి వడ్డీలు పెరిగిపోయాయి. కుమార్తెలు పెళ్లీడుకు రావడం, అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో వరప్రసాద్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆయన పనిచేస్తున్న పాఠశాలలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహానికి చేవెళ్ల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చింది. వరప్రసాద్ భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.