ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం 120 గ్రామాల ప్రజల దాహార్తికి కారణమైంది. సిబ్బందికి సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో పాటు పీఎఫ్ డబ్బులు జమచేయకపోవడంతో రామన్‌పాడు కాంట్రాక్ట్ సిబ్బంది తాగునీరు సరఫరా చేసే మోటార్లు బంద్ పెట్టారు.
ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం 120 గ్రామాల ప్రజల దాహార్తికి కారణమైంది. సిబ్బందికి సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో పాటు పీఎఫ్ డబ్బులు జమచేయకపోవడంతో రామన్‌పాడు కాంట్రాక్ట్ సిబ్బంది తాగునీరు సరఫరా చేసే మోటార్లు బంద్ పెట్టారు. షట్టర్లు మూసివేశారు. ఇప్పటికే లీకేజీల పేరుతో తాగునీరు సక్రమంగా అందక ఇబ్బంది పడుతున్న జనం.. ఇప్పుడు కాంట్రాక్టర్ కారణంగా మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గోపాల్‌పేట/కొత్తకోట అచ్చంపేట రక్షిత మంచినీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు గురువారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. దీంతో జిల్లాలోని 120 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచి పోయింది. మూడునెలల పెండింగ్ వేతనాలు, ఆరు నెలలకు సంబంధించి పీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు శుక్రవారం కొత్తకోట మండలం రామన్‌పాడు హెడ్‌వర్క్ దగ్గర సమ్మె చేపట్టారు. గోపాల్‌పేట, గట్టుతుమ్మన్‌పేట, రామన్‌పాడు పంప్‌హౌస్‌లల్లో అర్ధరాత్రి నుంచి మోటార్లు బంద్‌చేసి షట్టర్లు మూసివేయడంతో తాగునీటి సరఫరా పూర్తిగా స్తంభించింది.
దీంతో వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలలోని 120 గ్రామాల ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. ఈ అచ్చంపేట రక్షిత మంచినీటి పథకంలో ఆపరేటర్లు, లైన్‌మెన్లు, సూపర్‌వైజర్లు మొత్తం 72మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి గత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించలేదు. అదేవిధంగా పీఎఫ్ నిధి కోసం కార్మికుల జీతాలు నుంచి ఆరునెలల వాటాదానాన్ని తీసుకుని బ్యాంకులో జమచేయలేదు. దీనికోసం కార్మికులు పలుమార్లు కాంట్రాక్టర్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టారు.
కార్మికులతో కాంట్రాక్టర్
చర్చలు విఫలం
రామన్‌పాడు హెడ్‌వర్క్ దగ్గర సమ్మె చేస్తున్న కార్మికులతో కాంట్రాక్టర్ రాజశేఖర్ శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. శనివారం రోజు ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రెండు నెలల జీతాలను చెల్లిస్తానని విధుల్లో చేరాలని కాంట్రాక్టర్ నచ్చజెప్పారు. పీఎఫ్ నిధిలో ఆరు నెలల తమ వాటను తీసుకుని మీ వాటా కలిపి ఎందుకు బ్యాంకులో జమ చేయలేదని కార్మికులు ప్రశ్నించారు. లేకపోతే తమ డబ్బులైనా తిరిగి చెల్లించాలని అడిగారు. ఆలస్యమైన మాట వాస్తవమేనని సోమవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తానని కాంట్రాక్టర్ చెప్పారు. అయితే, తమకు జీతాలు చేతికి అందిన తర్వాతే విధుల్లో చేరతామని.. అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్పారు.
ఏప్రిల్ నెలలోనే నాలుగుసార్లు బంద్ అయిన మోటార్లు
ఏప్రిల్ నెలలోనే నాలుగుసార్లు మోటార్లు బంద్ కావడంతో 120 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి కొత్తకోట మండలం అజ్జకోలు దగ్గర లీకేజీ మరమతులకు నాలుగు రోజులు, వనపర్తి మండలం రాజనగరం-చిట్యాల గ్రామల మద్యం జేసీబీ తగిలి పగిలిన పైపు మరమతుకు మూడు రోజులు, మళ్లీ రాజనగరం సమీపంలో ఇటాచీ తగిలి పగిలిన పైపు మరమతుకు రెండు రోజులు, ఇప్పుడు కార్మికుల సమ్మె కారణంగా మోటార్లు బంద్ చేయడంతో రామన్‌పాడు నీళ్లపైన ఆధారపడిన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కార్మికులు జీతాల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.