
కనీసస్థాయికి శ్రీశైలం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస స్థాయి దిగువకు పడిపోయింది.
- 833.9 అడుగుల వద్ద నమోదైన నీటిమట్టం
- కనీసం 834 అడుగులుగా ఉండాలని నిబంధన
- తెలంగాణ విద్యుదుత్పత్తితో తగ్గిన నీటినిల్వ
- వేసవి తాగునీటి అవసరాలపై ఆందోళన
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస స్థాయి దిగువకు పడిపోయింది. ఆదివారం ప్రాజెక్టులో నీటినిల్వ 833.9 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో 834 అడుగుల కనీస నీటిమట్టాన్ని కాపాడాలని నిబంధన ఉంది. గతంలో హైకోర్టు కూడా ఈమేరకు తీర్పు ఇచ్చింది. తాగునీటి అవసరాలకు మినహా మిగతా అవసరాలకు 834 అడుగుల దిగువన నీటిని వాడుకోకూడదు. కానీ విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్నపుడు ఎడమగట్టు ఉత్పత్తి కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఆదివారం 0.219 మిలియన్ యూ నిట్ల విద్యుత్‌ను తెలంగాణ ఉత్పత్తి చేసింది. దీంతో గత వారమంతా 834 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం.. ఆదివారం 833.9 అడుగులకు తగ్గిపోయింది. గత ఏడాది ఇదే రోజున 867.5 అడుగులుగా నమోదైంది. అప్పుడు 131.85 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
వేసవి ఇంకా ప్రారంభం కాకముందే.. కనీస నీటిమట్టానికంటే దిగువకు నిల్వ పడిపోతే, తాగునీటి అవసరాలను ఎలా తీర్చాలనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. శ్రీశైలం ఎడమ గట్టున తెలంగాణ విద్యుదుత్పత్తి విషయంలో గత ఏడాది అక్టోబర్‌లో ఇరు రాష్ట్రాల మధ్య వివా దం తలెత్తిన విషయం విదితమే. ఇప్పుడు మళ్లీ తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో.. పీక్ అవర్స్‌లో ఒకట్రెండు గంట లు విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం నీటిని వాడుకుంటున్నారు. 790 అడుగుల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ గతంలో తెలంగాణ వాదిం చిన విషయం విదితమే. తాగునీటి అవసరాలను విస్మరిస్తే వేసవి నీటిఎద్దడిని అధిగమిం చడం కష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్‌లోనూ నీటి మట్టాలు ఆశాజనకంగా లేవు. ప్రస్తుతం 526.1 అడుగుల వద్ద 160.63 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సాగర్‌లో 510 అడుగుల వరకు నీటిని వాడుకోవడానికి అవకాశం ఉంది. సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద, కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాల కోసం ఇంకా 10 టీఎంసీల అవసరం ఉంది. తాగునీటికి 30-35 టీఎంసీలు కావాలని అధికారులు చెబుతున్నారు.