
ట్యాంకర్ వద్ద నీటి కోసం క్యూ..
చందుర్తి(వేములవాడ) : చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నా.. ఎటూ సరిపోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు ట్యాంకర్ల ద్వారా ఇంటికి 200 లీటర్లను సరఫరా చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ముఖం కడుక్కునేందుకు కూడా ఈ నీరు సరిపోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి రోజుకు 400 లీటర్లు అందజేస్తే నీటికష్టాలు తప్పుతాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలో ఇప్పటికే మూడు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారంపై అలసత్వం
మల్యాలలో పదేళ్లుగా మంచినీటి గోస ఉంది. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు, పాలకులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. రెండు మంచినీటి ట్యాంకులు నిర్మించినా వాటిని నింపేందుకు నీళ్లు లేక వృథాగా ఉంటున్నాయి. ఏటా ట్యాంకులను నింపేందుకు అద్దె బావులతోనే కాలాన్ని గడిపారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం లేదు.
డ్రమ్ము నీళ్లతోనే..
రోజంతా ఒక్క డ్రంబు నీళ్లతోనే సరిపెట్టుకోవాలి. నీళ్లు సరిపోవడం లేదన్న ఎవరూ పట్టించుకోవడం లేదు. వ్యవసాయ పొలాల వద్దకు వెళ్తే రైతులు కోపానికి వస్తున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. – గుంటిపెల్లి రాజవ్వ, ఎస్సీకాలనీ
పట్టించుకునేటోళ్లు లేరు
ఓట్లు వస్తే ఇంటికి పది సార్లు వచ్చి ఓటు ఎయ్యిమని బతిలాడుతరు. నీళ్లు లేక కరువు వచ్చి చచ్చి పోతున్నామంటే ఊల్లె ఉన్నోడు రాడు. ఊరవుతలోడు రాడు. నీళ్లు లేక సచ్చిన సరే పట్టించుకుంట లేరు. పది బిందెల నీళ్లతో ఇంట్లో పది మంది ఉంటే ఎట్లా గడుపుతాము. – గుంటిపెల్లి మల్లవ్వ, మల్యాల
Comments
Please login to add a commentAdd a comment