నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ రావులపల్లిలో ధర్నా చేస్తున్న గ్రామస్తులు
కొడంగల్ రూరల్ : మా ఊరిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడంలేదని మండల పరిధిలోని రావులపల్లి గ్రామస్తులు సోమవారం రోడ్డుపై భైఠాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తాగునీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయని వాపోయారు. పైప్‌లైన్ పగిలిపోయిన తర్వాత దాదాపు 15 రోజులుగా రోడ్డుపై ట్యాంకర్‌ను ఉంచి నీటి సరఫరా చేశారని, అయినా పూర్తి స్థాయిలో నీరు అందక ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు నెల రోజుల నుండి నీటి సరఫరా కాకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు, నాయకులకు తెలియజేసినా స్పందించపోవడంతో ధర్నాతో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో నాలుగు చేతిపంపులు ఉన్నా వాటిలో రెండు చెడిపోవడంతో సుదూర ప్రాంతం నుండి నీటిని తెచ్చుకుంటున్నామని అన్నారు. గ్రామ శివారులో దౌల్తాబాద్ రోడ్‌లోని రైస్‌మిల్ సమీపంలో నీటిని తెచ్చుకుం టున్నామని, ద్విచక్రవాహనాలు, సైకిళ్లపై బిందెలను పెట్టుకొని నీటిని తెచ్చుకుంటున్నామని అన్నారు.
సుదూర ప్రాంతం నుండి నీటి బిందెలను మోసుకొని రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని నినాదాలు చేశారు. రావులపల్లి గేటు సమీపంలో కొడంగల్– యాద్గిర్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విషయం తెలిసిన పోలీసులు ధర్నా ప్రాంతానికి చేరుకొని సంబంధిత కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. మంగళవారం సాయంత్రం వరకు నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలపడంతో నిరసన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment