నీటి యాతన | water problems in rural areas | Sakshi
Sakshi News home page

నీటి యాతన

Published Wed, May 7 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

నీటి యాతన

నీటి యాతన

గ్లాసెడు నీటి విలువ తెలియాలంటే గాంధారి మండలంలోని బూర్గుల్‌కు వెళ్లాల్సిందే. గ్రామంలో కనీస నీటి సౌకర్యాలు లేక గ్రామస్తుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నీరు తెచ్చుకోవడానికి వెళ్లి అనారోగ్యానికి గురై మహిళలు గర్భాన్ని కోల్పోతున్నారు. నీటిగోసతో బంధువులు ఊరికి రావాలంటేనే భయపడుతున్నారు. గ్రామ యువకులకు పిల్లలను ఇవ్వడం లేదు. నీటి సమస్యతో విడాకులైన ఘటనలు, ఊరు విడిచి వెళ్లిన కుటుంబాలూ ఉన్నాయి. ఒక్కరోజు నీరు పట్టుకుం టే.. మూడు, నాలుగు రోజులు తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఎడారి ప్రాంతంలో కూడా ఇంతటి నీటి కష్టాలు ఉండవేమో...
 
గాంధారి రూరల్, న్యూస్‌లైన్: గుక్కెడు నీటికోసం గాంధారి మండలంలోని బూర్గుల్ గ్రామస్తులు కన్నీటి కష్టాలకు గురవుతున్నారు. దాహం తీర్చుకునే క్రమంలో గ్రామ మహిళలు కడుపుకోతకు గురవుతున్నారు. నీరు తెచ్చుకోవడానికి వెళ్లితే.. గర్భశోకాలు మిగులుతున్నాయి. చిన్నా,పెద్ద, ముసలి అంటూ తేడా లేకుండా అంద రూ నీటికోసం ముష్టియుద్ధాలు చేయాల్సిందే. ఉదయం లే చింది మొదలు అర్ధరాత్రి వరకు నీటికోసం పాకులాడాల్సిందే. గర్భం దాల్చిన వారు నీళ్లు మోసి గర్భాన్ని పోగొట్టుకుంటుంటే.. పెళ్లికాని యువకులకు పిల్లనివ్వడంలేదు. బంధువులు ఊరికి రావాలంటేనే జంకుతున్నారు. కొందరు మహిళలు నీళ్లు మోయ డం చేతకాక భర్తలకు విడాకులు ఇచ్చారంటే గ్రామంలో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 కనీస నీటి వనరులు లేక
 బూర్గుల్ గ్రామస్తులను నీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటిన ఈ గ్రామంలో... అధికారులు, ప్రజాప్రతినిధులు కనీస ఏర్పాట్లు చేయక పోవడంతో నీటికోసం వారు నానా పాట్లు పడుతున్నారు. గ్రామంలో మొత్తం జానాభా 1,150  మంది ఉన్నారు. వీరికోసం సింగిల్‌ఫేజు మోటార్లు గానీ చేతిపంపులు లేవు. రెండు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోరు నుంచి పైపులైన్ ద్వారా అది విద్యుత్ సరఫరా ఉంటే వచ్చే సన్నని ధార వద్ద నీటిని పట్టుకుం టున్నారు. బిందెడు నీటికోసం తల్లీ పిల్ల, తండ్రీ కొడుకు, భార్యభర్తల మధ్యన బంధువులతో, స్నేహితులతో సైతం ముష్టియుద్ధాలకు దిగాల్సి న పరిస్థితి ఉంది. 2012లో గ్రామానికి వచ్చిన అప్పటి మంత్రి సుదర్శన్‌రెడ్డికి నీటి సమస్యను వివరిస్తే, దొంగలమర్రిలొంక కుంటకు నిధులు మంజూరు చేసి నీటి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ  నెరవేరలేదు.
 
 గర్భాలు కోల్పోయి
 బూర్గుల్ గ్రామం గుట్టపైన, కింద రెండు భాగాలుగా ఉంది. గుట్టపై 1995లో ట్యాంకు నిర్మించారు. నీళ్లు లేక ట్యాంకును వృథాగా వదిలేశారు. వ్యవసాయ  క్షేత్రంలోంచి వచ్చిన పైపులైన్ గుట్టకింద ఉంది. దీంతో ఇక్కడి నుంచే సన్నని ధార ద్వారా నీళ్లు తీసుకెళతారు. అలా నీటి బిందెలతో గుట్టపైకి ఎక్కుతున్న మహిళలు, పురుషులు అనారోగ్యాలకు గురవుతున్నారు. గ్రామంలో నర్సవ్వ, రేక, స్రవంతి, బాలమణి అనే మహిళలతో పాటు 30 మంది వరకు గర్భాలు కోల్పోయారు. పెళ్లీడు కొచ్చిన యువకులకు పిల్లనివ్వడంలేదు. పిల్లను ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన మాధవపల్లి సురేశ్ బొప్పాజువ్వాడికి ఇల్లరికం వెళ్లాడు. చంద్రు, లక్‌పతి మరో నలుగురికివిడాకులయ్యాయి. పది కుటుంబాలవారు గ్రామాన్ని వదిలి ఇతర ప్రాంతాల కు   వెళ్లారు.
 
 ఇంటికి రూ.5 వేల చొప్పున..
 అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులందరూ ఇంటికి రూ.5 వేల చొప్పున జమ చేసుకున్నారు. అలా రూ. 9 లక్షలతో ఐదు బోర్లు వేయించారు. అయినా చుక్క నీరు రాలేదు. ఎస్సీ కాలనీ వారు మళ్లీ మరో రూ. 2 వేల చొప్పున రూ. 22 వేలు జమచేసి పాత బోరు బావిలో మోటారు దింపారు. ప్రస్తుతం అందులో కూడా నీరు రావడంలేదు. గుమ్మడి చాకలి బాలవ్వ తన పంట చేనులో రూ.1.50 లక్షలతో బావి తవ్వించుకుంది. రెండు మూడు రోజుల్లో కుటుంబంతో సహా అక్కడికే వెళతానంటోంది. ఒకరోజు పట్టుకున్న నీళ్లు మూడు రోజుల వరకు తాగాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోయారు. ఈనెల 15న గ్రామంలో రాజరాజేశ్వరస్వామి జాతర ఉంది  నీళ్లకు భయపడి జాతరకు బంధువులు ఎవరూ రావడం లేదని గ్రాస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బొప్పాజువ్వాడి వద్ద లేదా మూడు కిలోమీటర్ల దూరంలో బోరు వేసి తాగునీటి పథకం ద్వారా నీటిని అందించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement