శివార్లను పీల్చి.. సిటీకి.. | Water Tankers Scam in City Out Cuts | Sakshi
Sakshi News home page

శివార్లను పీల్చి.. సిటీకి..

Published Wed, Sep 11 2019 4:33 AM | Last Updated on Wed, Sep 11 2019 4:33 AM

Water Tankers Scam in City Out Cuts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ శివార్లలో నీటివ్యాపారం కోట్లు దాటింది. చాలామంది రైతులు తమభూముల్లో బోరుబావులు తవ్వి నీటిని గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు విక్రయిస్తున్నారు. ఫలితంగా వ్యవసాయం ‘నీరు’గారింది. నీటివ్యాపారం చేసే రైతులు, ట్యాంకర్‌ యజమానుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, రైతుల కంటే ట్యాంకర్‌ మాఫియాకు కోట్లాది రూపాయల లాభాలు సమకూరుతున్నాయని ఐఐటీ గౌహతి, నెదర్లాండ్స్‌కు చెందిన వేజ్‌ నింజెన్‌ వర్సిటీ నిపుణులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. ‘నీళ్లు ఎవరివి.. లాభాలు ఎవరికి’అన్న అంశంపై జరిగిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో వెలుగుచూసిన పలు అంశాలు ఇవీ..

తగ్గిన వ్యవసాయభూములు
ఔటర్‌రింగ్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాల రైతులు వ్యవసాయం కంటే ఇతర వృత్తులపైనే ఆధారపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ, బీపీవో, పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ పార్కులు, ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరించడంతో ఇక్కడ వ్యవసాయ భూముల సంఖ్య తగ్గింది. రైతులకు నష్టపరిహారంతోపాటు హెచ్‌ఎండీఏ లే అవుట్లలో నివాస స్థలాలు కేటాయించింది. ఆ ప్లాట్లలో ఇప్పుడు బోరుబావులు తవ్వి ఆ నీటిని ఫిల్టర్‌ప్లాంట్లు, ఇతర పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు రైతులు విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ప్రధానంగా కోకాపేట్, ఆదిభట్ల ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. 

విచక్షణా రహితంగా బోరుబావులు
విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం కారణంగా శివార్లలో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సరాసరిన 1,000–1,500 అడుగుల లోతుకుపైగా బోరుబావులు తవ్వాల్సి వస్తోంది. వర్షపునీటి నిల్వ చేసేందుకు ఆయా ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార, రియల్టీ వర్గాలు చర్యలు తీసుకోవడంలేదు. నీటిలేమి కారణంగా చిన్న రైతులు వ్యవసాయం వీడి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు.

రైతులవి నీళ్లు..లాభాలు ట్యాంకర్‌ మాఫియాకు..
రైతులు నీటిని విక్రయిస్తే.. ఒక్కో ట్యాంకర్‌(ఐదువేల లీటర్లు)కు రూ.150 నుంచి రూ.200 వరకు మాత్రమే లభిస్తోంది. అదే నీటిని తీసుకెళ్లి వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, రిసార్ట్స్,కార్పొరేట్‌ కంపెనీలు, విద్యాసంస్థలకు విక్రయిస్తున్న ట్యాంకర్‌ యజమానులకు ఒక్కో ట్రిప్పునకు రూ.800 నుంచి రూ.1200 వరకు గిట్టుబాటవుతోంది. 

సాగు తగ్గడానికి కారణాలు..
- రైతులు తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో సాగుచేస్తే వచ్చే దిగుబడులు ఆశాజనంగా లేకపోవడం
వర్షపాత లేమి , చీడపీడల నివారణకు అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తుండడం
పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు ఆశించిన మేర గిట్టుబాటు ధర లభించకపోవడం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement