'రేపు అసెంబ్లీని ముట్టడిస్తాం'
హైదరాబాద్‌సిటీ: మత పరమైన రిజర్వేషన్‌లకు తాము వ్యతిరేకమని, అసెంబ్లీలో బిల్లు పెట్టడాన్ని అడ్డుకుంటామని బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. రేపు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అసెంబ్లీని ముట్టడించి తీరుతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్న బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అక్రమ కేసులతో ప్రజల గొంతు నొక్క లేరని హెచ్చరించారు. ధర్నా చౌక్ ఎత్తి వేయడం ఆపేయాలని కోరారు. పోలీస్ రాజ్యంతో రేపు జరుగబోయే అసెంబ్లీ ముట్టడిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. మత పరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.
ప్రైవేటు బడుల్లో దోపీడీపై ప్రేక్షకపాత్ర
దేశ రాజధాని ఢిల్లీ కన్నా హైదరాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు సైతం మూడు నాలుగు లక్షల ఫీజులను దండుకుంటున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని కె.లక్ష్మణ్ మండిపడ్డారు.. ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ కళాశాలల ఫీజులను ఎందుకు నిర్ణయించలేకపోతోందని గురువారం అసెంబ్లీలో ప్రశ్నించారు.
అధిక ఫీజుల విషయంలో 12 పాఠశాలలకు నోటిసులు ఇచ్చామని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని లక్ష్మన్ నిలదీశారు. కార్పొరేట్ పాఠశాలల అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడేళ్లు అయినా కేజీ టూ పీజీ విద్య పథకానికి ఓ విధానం రూపకల్పన చేయలేదని తప్పుపట్టారు. శతాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్న ఓయూలో 1267 ప్రొఫెసర్ పోస్టులకు గాను 553 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుత అవసరాలకు కనీసం 3500 బోధన సిబ్బంది అవసరమన్నారు. బోధన సిబ్బంది లేక ఓయూలో పరిశోధనలు, పీహెచ్‌డీ ప్రవేశాలు నిలిచిపోవడం ఆవేదన కలిగిస్తోందని లక్ష్మన్ అన్నారు.