ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేయం
* సచివాలయం ‘సీ’ బ్లాక్ ముందు ఉద్యోగుల ధర్నా
* తానున్నానంటూ ఉద్యోగులకు కేసీఆర్ భరోసా
* ఆంధ్రాకు కేటాయించిన ఉద్యోగులు తెలంగాణలోనే ఉంటారని హామీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ సచివాలయం.. అయినా జై తెలంగాణ నినాదాలు.. ధర్నా! అదీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించే ‘సీ’ బ్లాకు ముందు!! బుధవారం సచివాలయంలో తెలంగాణకు చెందిన దాదాపు రెండు వందల మందికిపైగా నాలుగో తరగతి ఉద్యోగులు ఈ ఆందోళనకు దిగారు. తమను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయించారని, ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేసే ప్రశ్నే లేదంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కార్యాలయ బ్లాకులోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని రోప్ పార్టీని ఏర్పాటు చేశారు.
దీంతో వారు పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. కాసేపటికి సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వచ్చి వారికి సర్దిచెప్పే యత్నం చేశారు. అదే సమయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ముగించుకుని, మెదక్ జిల్లా గజ్వేల్ వెళ్లడానికి కిందకు దిగిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నేరుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగుల వద్దకు వచ్చారు. ‘‘మీకు ఆందోళన వద్దు.. మీకు నేనున్నాను. మీరంతా తెలంగాణ ప్రభుత్వంలోనే పనిచేస్తారు. ఆ భరోసా నేనిస్తున్నా’’ అని స్పష్టం చేయడంతో వారు శాంతించారు. కాగా, నాలుగో తరగతి ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించిన అంశాన్ని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాసినట్లు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తమ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఇక్కడే పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
ప్రతి తెలంగాణ ఉద్యోగీ ఇక్కడే: శ్రీనివాసగౌడ్
ప్రతి తెలంగాణ ఉద్యోగి ఇక్కడే ఉంటాడని టీజీవో చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగాక ఉద్యోగుల విషయంలో కొంత గందరగోళం జరిగిన మాట వాస్తవమేనన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మాట్లాడుకున్నాక ఈ విషయం ఒక కొలిక్కి వస్తుందన్నారు. సీమాంధ్రకు పంపిన ఉద్యోగులు ఒకవేళ అక్కడ చార్జి తీసుకోకపోయినా వారిని కాపాడుకుంటామన్నారు.