ఇంటికో ఐదు లక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పేదల కోసం రెండు పడక గదుల గృహాల నిర్మాణాన్ని త్వరలోనే చేపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తొలిదశ కింద ఒక్కో మున్సిపాలిటీలో 500 నుంచి 1,000 ఇళ్లను నిర్మిస్తామని.. ఒక్కో ఇంటికి రూ.5లక్షలు ఖర్చు చేసేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలపై రూపాయి భారం పడకుండానే ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాల నీని ఆదర్శంగా తీసుకుని ఈ నిర్మాణాలు జరపాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లతో సీఎం సమావేశమై.. నగర, పట్టణ గృహ నిర్మాణంపై పలు ఆదేశాలు జారీచేశారు. మైవాన్ టెక్నాలజీతో కట్టే నిర్మాణాలను, ఐడీహెచ్ కాలనీని మంగళవారం కలెక్టర్లు సందర్శించాలని సూచిం చారు. ఇందిరమ్మ, ఐఏవై పథకాల కింద ఇళ్లు మంజూరైన వారిలో నిజమైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేం దుకు విచారణ జరపాలని కలెక్టర్లకు సూచించారు
గ్రామీణ ప్రాంతంలో 125 గజాలు, పట్టణ ప్రాంతాల్లో 75 నుంచి 100 గజాల వరకు స్థలాలను ఇంటి నిర్మాణానికి కేటాయించాలి.
ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు 550 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. తర్వాత తరానికీ ఉపయోపడేలా కచ్చితంగా పిల్లర్లతో నిర్మాణం జరపాలి.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్లు, నగర పంచాయతీల్లో జీ+1, మున్సిపాలిటీలు, ఆపైస్థాయి పట్టణాల్లో జీ+2 పద్ధతిలో చేపట్టాలి.
ఇళ్ల నిర్మాణానికి ఓపెన్ టెండర్లు పిలవాలి.
రాష్ట్రంలోని 67 మున్సిపాలిటీల్లో పేదల కోసం ఒక అంతస్తు(జీ+1), రెండస్తుల (జీ+2) గృహ సముదాయాలను నిర్మించాలి.
ఇందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి.
లేఔట్ కాలనీలను ముందుగా గుర్తించి అక్కడ తొలుత ఇళ్లను నిర్మించాలి.
‘హరితం’ శివం సుందరం
‘హరితం శివం సుందరం’ భావన అందరిలో కలిగేలా ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని హరితహారం కార్యక్రమంపై సోమవారం సమీక్షలో సూచించారు. జూలై రెండో వారంలో నిర్వహించే హరితహారంలో వర్షాకాలం ఆరంభంలోనే 40 కోట్ల మొక్కలు నాటాలన్నారు. ‘‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనీసం వంద గ్రామాల్లో ఊరికి 40 వేల చొప్పున 40 లక్షల మొక్కలు నాటాలి. నిధుల కొరతను నివారించేందుకు ఉపాధి హామీ పథకంతో అనుసంధానించండి.
క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు సమన్వయం చేయాలి. మొక్కలు నాటడం, సంరక్షణపై ప్రచారానికి పోస్టర్లు, టీ షర్టులు, బ్యాడ్జీలు, టోపీలు పంపిణీ చేయండి. విద్యార్థులను భాగస్వాములను చేయండి. సాంస్కృతిక సారథి కళాకారుల సేవలను వాడుకోండి. రైతులను భాగస్వాములుగా చేసి మామిడి, చింత, టేకు లాంటి పండ్లు, నీడనిచ్చే చె ట్లు పెంచాలి. పచ్చదనం పరిరక్షణకు గ్రామ హరిత రక్షణ కమిటీలు వేయండి’’ అని ఆదేశించారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని ప్రస్తుత 24 శాతం నుంచి 33 శాతానికి పెంచేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. 27 లక్షల హెక్టార్ల అటవీ భూముల్లో చెట్లు పెంచాలి. ‘‘రిజర్వు ఫారెస్టుల్లోనూ చెట్లు కనిపించడం లేదు.
స్మగ్లర్లు, అగ్ని ప్రమాదాలు, కబ్జాలతో అడవి అంతరిస్తోంది. స్మగ్లర్లు, అటవీ భూములను కబ్జా చేసేవారిపై పీడీ యాక్టు ప్రయోగించండి. అటవీ అధికారులకు గన్‌మెన్‌ను కేటాయిస్తాం. ప్రతి కన్జర్వేటర్‌కు రూ.20 లక్షలు, డీఎఫ్‌ఓకు రూ.10 లక్షలు కేటాయిస్తాం. డీఎఫ్‌ఓలకు జీపులు, రేంజర్లకు మోటారుసైకిళ్లు ఇస్తాం. అటవీ భూముల కబ్జాను అరికట్టే అధికారులకు అవార్డులు, పదోన్నతులుంటాయి’’ అని పేర్కొన్నారు. సమీక్షలో మంత్రి జోగు రామన్న, సీఎస్ రాజీవ్ శర్మ, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.