బాగా పనిచేసి రుణం తీర్చుకుంటాం
హైదరాబాద్ సిటీ: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులందరికీ 44 శాతం ఫిట్‌మెంట్‌తో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆర్టీసీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయమని, తమ పట్ల సీఎం కేసీఆర్ ఆదరణకు రుణపడి ఉంటామని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ), ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) అధ్యక్షులు అశ్వద్థామరెడ్డి, రాజిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, ఇకపై రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఆర్టీసీని లాభాల బాట పట్టించడంతోపాటు, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.
సమ్మె కాలంలో ప్రయాణికులకు జరిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరారు. వెనువెంటనే సమ్మె ఉపసంహరించుకుంటున్నామని, డ్రైవర్లు, కండక్టర్లందరూ ఉన్నపళంగా విధుల్లో చేరాలని కోరినట్టు తెలిపారు. బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశం అనంతరం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు.