'సర్వే బోగస్, కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు ఖాయం'
హైదరాబాద్ : ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వే అంతా బోగస్ అని ఆయన కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపారని చిన్నారెడ్డి శుక్రవారమిక్కడ ఎద్దేవా చేశారు. మూడేళ్ల పాలనలో విద్యార్థులు, యువత, రైతులు, ఉద్యోగస్తులు సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. సర్వేలతో కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ప్రజలకు చెవిలో పూలు పెట్టారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. సర్వేలో గెలుస్తున్నామంటున్న కేసీఆర్ తన పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించరని చిన్నారెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఇక బడ్జెట్ సమావేశాలను 14 రోజులకు కుదించడం దారుణమని చిన్నారెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో 30 రోజులకు ఎప్పుడూ తక్కువ నిర్వహించలేదని, బీఏసీ సమావేశానికి సీఎం డుమ్మా కొట్టడంతోనే ప్రభుత్వ తీరుకు అద్ధం పడుతోందని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఒక రోజుకు కుదించడం కుట్ర అని ఆరోపించారు. దీనివల్ల సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా పోతుందంటూ ప్రభుత్వం సభనుంచి పారిపోతోందని విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను సభలో ఎండగడతామని, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రభుత్వం చేసిన సర్వే బోగస్, హాస్యాస్పదంగా ఉందన్నారు.