ఎంపీగా ఎవరు.. | Who MP... | Sakshi
Sakshi News home page

ఎంపీగా ఎవరు..

Published Mon, Jan 26 2015 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

Who MP...

* వరంగల్ లోక్‌సభకు త్వరలో కడియం రాజీనామా
* ‘కారు’లో పోటీ అభ్యర్థులపై కానరాని స్పష్టత
* టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం
* ‘గులాబీ’ ఎమ్మెల్సీ ఆశావహుల్లో అసంతృప్తి

సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్‌ఎస్‌కు మరో ఉప ఎన్నిక పరీక్ష వస్తోంది. కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో వరంగల్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఎన్నిక అనివార్యం కాగా... టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు  కడియం శ్రీహరికి పెద్ద సవాలేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు సైతం ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారనుంది.

తాజా పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గులాబీ వర్గాల్లో ఈ అంశంపై ఇప్పటికే చర్చ మొదలైంది. వరంగల్ లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో టీఆర్‌ఎస్‌లోని ఈ వర్గం నేతల్లో ఎవరికి అవకాశం వస్తుందనే అంశంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.  టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేసిన చాలా మంది ఎస్సీ వర్గం నేతలు ఆ తర్వాత కాలంలో పార్టీకి దూరమయ్యారు. 2014 ఎన్నికలకు ముందు ఇది ఎక్కువగా జరిగింది.

కొందరు పార్టీ మారగా, మరికొందరు స్తబ్దుగా ఉన్నారు. 2014 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్... పార్టీలో గెలిచే స్థాయి నేతలు లేరనే ఉద్దేశంతో కడియం శ్రీహరిని తీసుకున్నారు. కేసీఆర్ అంచనాలకు తగినట్లుగానే ఈ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానాన్ని టీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు కడియం రాజీనామా చేయనున్న నేపథ్యంలో అభ్యర్థిత్వం విషయంలో టీఆర్‌ఎస్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అన్యూహ రాజకీయాలు, నియామకాలకు చిరునామాగా ఉండే గులాబీ పార్టీలో వరంగల్ లోక్‌సభ అభ్యర్థి ఎవరు అనే దానిపై ఇప్పటికిప్పుడు స్పష్టత రావడం లేదు.

గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించి ఇప్పుడు స్తబ్ధుగా ఉన్న పసునూరి దయాకర్, జన్ను జకారియాలకు అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పి.సాంబయ్య పేరు వినిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మంద జగన్నాథం వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. టీఆర్‌ఎస్‌కు దూరమైన మాజీ ఎమ్మెల్యే ఒకరు మళ్లీ పార్టీలోకి వస్తారని తెలుస్తోంది. అన్యూహ రాజకీయాలు, నియామకాలకు చిరునామాగా ఉండే గులాబీ పార్టీలో కొత్త వారికీ అవకాశం వచ్చే పరిస్థితి ఉండనుంది.
 
ఇలా ఎన్నాళ్లు...
ప్రస్తుత పరిస్థితుల్లో కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్‌రావు ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున నామినేటెడ్ చేసే ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే పోటీ నెలకొంది. కడియం శ్రీహరికి నామినేటెడ్ ఎమ్మెల్సీ అవకాశం వస్తుందా... ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందా అనేది స్పష్టత రావడంలేదు.

కడియం శ్రీహరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సి వస్తుండడంతో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న జిల్లా నేతల్లో అసంతృప్తి నెలకొంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకుండా... పనిచేస్తున్న నేతలు ఈసారి కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వీరికి మళ్లీ ఎదురుచూపులే మిగలనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement