‘ఎయిమ్స్’పై ఎందుకింత జాప్యం!
- రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, తనిఖీ జాబితా (చెక్‌లిస్ట్) పంపడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. రెండు మూడు ప్రాంతాలను గుర్తించి అక్కడున్న మౌలిక సదుపాయాలు, అవకాశాలపై నివేదిక ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో త్వరగా ఆ సమాచారం పంపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది.
పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ ఏర్పాటుకు అనువైన రెండు మూడు ప్రాంతాలను తనిఖీ చేసి జాబితా పంపితే... వాటి ఆధారంగా కేంద్ర నిపుణుల బృందం పరిశీలనకు వస్తుంది.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు వాటిలో ఒక ప్రాంతాన్ని ఖరారు చేస్తుంది. ఇం దులో భాగంగా ఎయిమ్స్ ఏర్పాటుకు నల్లగొండ జిల్లా బీబీనగర్ అనువైన ప్రాంతమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గత నెల సీఎం కేసీఆర్ బీబీనగర్ వెళ్లి అక్కడ 160 ఎకరాల భూమిని పరిశీలించి.. అక్కడే ఎయిమ్స్ నిర్మాణం చేపడతామని కూడా ప్రకటించారు.
గతంలో రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎయిమ్స్ కోసం భూములు, మౌలిక వసతుల పరిశీలన జరిపారు. కానీ తనిఖీ జాబితా తయారుచేయకపోవడంతో ఇప్పుడు కేంద్ర ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ లేఖతో మిగతా ప్రాంతాల తనిఖీ జాబితా పంపేం దుకు సన్నద్ధమయ్యారు. అయితే నిబంధనల ప్రకారం రెండు మూడు ప్రాంతాల వివరాలు పం పినా... రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిర్ణయం మేరకే ఖరారు చేస్తారు. ఈ లెక్కన బీబీనగర్‌లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన అక్కడే ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు కేంద్ర బృందం అంగీకరించే అవకాశముంది.
200 ఎకరాలు అవసరం..
ఇక ఎయిమ్స్ నిర్మాణానికి 200 ఎకరాల స్థలం అవసరమని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బీబీనగర్‌లో గుర్తించిన భూమి 160 ఎకరాలే. అందులోనూ పదెకరాలు పారామెడికల్ సంస్థకు ఇచ్చారు. ఈ స్థలం పక్కన మరో 50 ఎకరాలు సేకరించాలని సీఎం కార్యాలయం నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను తాజాగా ఆదే శించింది.
ఇవ్వాల్సిన వివరాలెన్నో..
కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు అనుమతి ఇవ్వాలం టే తనిఖీ జాబితా తప్పనిసరి. ఇందులో తొమ్మిది ప్రధాన అంశాలు ఉంటాయి. ప్రతిపాదిత భూమి, భౌగోళిక పరిస్థితి వివరాలు, ఆ ప్రాంతంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు, వైద్య సదుపాయాలు, వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు వంటి అంశాలతో కూడిన జాబితాను కేంద్రానికి అందజేయాల్సి ఉంటుంది.