గ్రేటర్‌పై చంద్ర ముద్ర
- నగరంపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
- హైదరాబాద్‌కి గ్లోబల్‌సిటీ ఇమేజ్
- మౌలిక సదుపాయాల కల్పన
- అందుకే కీలక శాఖలన్నీ ఆయన వద్దే!
- జీహెచ్‌ఎంసీ ఎన్నికలపైనా దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: కొత్త ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నగరంపై ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్‌కి ఇప్పటికే ఉన్న ఇమేజ్‌ను మరింత మెరుగుపరిచి గ్లోబల్‌సిటీ గా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నగరంపై ‘విజన్’ ఉన్నందునే ఆయన మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను తన వద్దే ఉంచుకున్నారని నగరంలో ముఖ్య విభాగాలకు బాధ్యత వహిస్తున్న అధికారులు చెబుతున్నారు.
దీనికితోడు సీఎంగా ప్రమాణం చేశాక పరేడ్ గ్రౌండ్‌లో ప్రజలనుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలోనూ నగరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మెరుగైన రవాణా వ్యవస్థ, పేదలందరికీ గృహసదుపాయం కల్పిస్తామన్నారు. సామాన్యులకవసరమైన మౌలిక సదుపాయాలను ప్రస్తావిస్తూనే మరోవైపు అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను చాటుతామన్నారు. ఈ రెండు లక్ష్యాలతో నగరాన్ని తీర్చిదిద్దే ఉద్దేశంతోనే ఆయన వాటి అమలు బాధ్యతనూ తానే తీసుకున్నారు. అందుకే సదరు విభాగాలను తన వద్దే ఉంచుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో..
మెరుగైన రవాణా వ్యవస్థ, అద్దంలాంటి రోడ్లు, పారిశుధ్యం, 24 గంటలూ విద్యుత్-తాగునీరు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు.. ఇవన్నీ సవ్యంగా ఉన్న నగరం ‘అంతర్జాతీయ స్థాయి’ని పొందుతుంది. అప్పుడే పేరెన్నికగన్న సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తాయి. ఈ సదుపాయాల నిర్వహణను చూసే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి విభాగాలన్నీ మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నాయి. మెట్రోరైలు ప్రాజెక్టు సైతం వీటి పరిధిలోనే ఉంది.
అందుకే కేసీఆర్ స్వయంగా తానే శ్రద్ధ చూపేందుకు ఈ శాఖల్ని తనవద్దే ఉంచుకున్నారని చెబుతున్నారు. గ్రేటర్ తాగునీటి అవసరాలు తీర్చే కృష్ణా ప్రాజెక్టు మూడో దశ, గోదావరి మొదటి దశ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మెట్రోరైలు పనుల రెండో దశపై చర్చలు జరుగుతున్నాయి. రూ. 16 వేల కోట్ల విలువైన మెట్రో పనులు 2017 నాటికి పూర్తి కావాల్సి ఉండగా, తొలిదశ వచ్చే ఏడాదికి పూర్తికావాల్సి ఉంది.
ఇవన్నీ సజావుగా సాగడంతోపాటు గ్లోబల్‌సిటీ బ్రాండ్ ఇమేజ్ పొందాలంటే ఐటీ, ఇతర కంపెనీలను ఆకట్టుకోవాలి. కేంద్రం మంజూరు చేసిన ప్రతిష్టాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టును అమలు చేయాల్సి ఉంది. అంతర్జాతీయ నగరమంటే మురికివాడల రహిత నగరంగా ఉండాలి. అందుకే గ్లోబల్ సిటీతో పాటు స్లమ్‌ఫ్రీ సిటీని కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. స్లమ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రారంభించిన రే పథకం ఏడాదిన్నర క్రితమే నగరంలో ప్రారంభమైనా.. కదలిక లేదు. వీటన్నింటి అమలుకు, తనదైన ముద్ర వేసేందుకే కేసీఆర్ వీటిపై శ్రద్ధ వహిస్తున్నారని తెలుస్తోంది.
‘స్థానిక’ పగ్గాల కోసం..
మరోవైపు త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడాలన్నా, స్థానిక సంస్థలో పగ్గాలు చేతబట్టాలన్నా వీటన్నింటినీ సక్రమంగా అమలు చేస్తేనే సాధ్యమనే అంచనాలో కేసీఆర్ ఉన్నారు. అందుకే నగరపాలనలో కీలకపాత్ర వహించే విభాగాలను తన వద్దే ఉంచుకున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఐటీఐఆర్‌తో అభివృద్ధి
ఐటీఐఆర్ ప్రాజెక్టుతో ‘మహా’ నగరం అనూహ్యంగా మారిపోనుందని కొత్త సర్కార్ ఆశలు రేకెత్తిస్తోంది. నగరం చుట్టూ అంటే.. ఔటర్ రింగ్ రోడ్డు గ్రోత్ కారిడార్ లోపల సుమారు 202 చ.కి.మీ. మేర 5 జోన్లలో ఐటీఐఆర్ ప్రాజెక్టులు రూపుదిద్దుకొంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపైనే నగరాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అలాగే హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ఐటీఐఆర్‌ల కోసం ప్రత్యేకంగా భూ వినియోగాన్ని ప్రతిపాదించలేదు. ఐటీఐఆర్‌లకు అనుగుణంగా భూ వినియోగం ఉండాలి. ఇందుకోసం కొత్త ప్రభుత్వం బృహత్ ప్రణాళికలో మార్పులు చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చేనా?
ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. నిధులతో పాటు కోర్టు కేసుల పరిష్కారంలోనూ కొత్త ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంది
మియాపూర్‌లో ఇంటర్ బస్ టెర్మినల్, శివార్లలో ట్రక్‌పార్కుల ఏర్పాటు కలగానే మిగిలాయి. వీటికి టెండర్ల ప్రక్రియ పూర్తయినా నిధుల్లేక పనులను పట్టాలెక్కలేదు.
బేగంపేట ఎన్టీఆర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వరకు రూ.35 కోట్లతో తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రాణం పోయాల్సి ఉంది
పాతబస్తీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు అతీగతీ లేవు
ఇవన్నీ సాకారం కావాలంటే కొత్త ప్రభుత్వం బాగా నిధులు కేటాయించాల్సి ఉంది