ఆసరా పింఛన్లు ఆరంభమైనప్పటి నుంచి అనేక నిబంధనలతో లబ్ధిదారులను అష్టకష్టాలకు గురిచేస్తున్న అధికారులు వితంతు పింఛన్లకు మళ్లీ కొర్రీలు పెడుతున్నారు...
- భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
- లేకుంటే వచ్చే నెల నుంచి పింఛన్‌కు బ్రేక్
- మళ్లీ మొదటికి రానున్న తంతంగం
- ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు
- భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
- అది సమర్పిస్తేనే వచ్చే నెల నుంచి ‘ఆసరా’
- మళ్లీ మొదటికి రానున్న తతంగం
- ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు
ముకరంపుర : ఆసరా పింఛన్లు ఆరంభమైనప్పటి నుంచి అనేక నిబంధనలతో లబ్ధిదారులను అష్టకష్టాలకు గురిచేస్తున్న అధికారులు వితంతు పింఛన్లకు మళ్లీ కొర్రీలు పెడుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి ప్రభుత్వం అందించే పింఛన్‌తో రోజులు నెట్టుకొస్తున్న అభాగ్యులను డెత్ సర్టిఫికెట్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. భర్త చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణపత్రం అందజేస్తేనే వచ్చే నెల నుంచి వితంతు పింఛన్ ఇస్తామని చెబుతుండడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రారంభంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని నిబంధన పెట్టినప్పటికీ వాటిని తప్పనిసరి చేయలేదు. కొన్నేళ్ల క్రితం మరణించిన వారి సర్టిఫికెట్లు ఎలా తీసుకురాగలమని సర్వత్రా ఆందోళన వ్యక్తం సర్కారు వెనక్కు తగ్గి ఈ నిబంధనను సడలించింది. వితంతు పింఛన్లలో బోగస్‌లు ఉండే అవకాశం లేదని భావిస్తూ మానవీయకోణంలో ఆలోచించి పింఛన్లు మంజూరు చేయూలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం నగర పంచాయతీ, మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలన్న నిబంధనను అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 1,31,213 వితంతు పింఛన్‌దారులున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,04,216, పట్టణ ప్రాంతంలో 26,997 మంది ఉన్నారు. వీరిలో 70 శాతం లబ్దిదారులు మధ్య వయస్సు నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారే. దాదాపు 20 ఏళ్ల క్రితం భర్త మరణించిన వారు ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న కారణంగా చుట్టూ తిరిగే పరిస్థితి లేదు. మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియని నిరక్షరాస్యులకు మరింత ఇబ్బందిగా మారింది. 15 నుంచి 20 ఏళ్ల క్రితం చనిపోయిన వారి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్నపని. జనన, మరణ ధ్రుువీకరణ పత్రాలకు సంబంధించి వెంటనే స్థానిక సంస్థల్లో నమోదు చేస్తేనే వచ్చే అవకాశముంది. నెలలు, సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత డెత్ సర్టిఫికెట్ రావాలంటే పెద్ద తంతగమే ఉంటుంది.
అదో పెద్ద తంతు..
ఏళ్ల క్రితం చనిపోయిన తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రం స్థానిక సంస్థల నుంచి పొందాలంటే స్థానికంగా నమోదై ఉండాలి. అప్పట్లో నమోదు చేయనివారు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలో నాన్ అవైలబులిటీ (రికార్డుల్లో నమోదు కానట్లు)గా లేఖను తీసుకోవాలి. అనంతరం ఒక గెజిటెడ్, ఇద్దరు నాన్ గెజిటెడ్ అధికారుల స్టేట్‌మెంట్ తీసుకుని నోటరీ అఫిడవిట్‌తో మీ సేవ ద్వారా ఆర్డీవోకు దరఖాస్తు చేయూల్సి ఉంటుంది.
ఈ దరఖాస్తులను విచారించాల్సిందిగా ఆర్డీవో కార్యాలయం నుంచి తహశీల్దార్లకు సమాచారం పంపుతారు. వీఆర్‌వో, ఆర్‌ఐలు విచారణ జరిపి నివేదికను తహశీల్దార్ కార్యాలయంలోని ఏఎస్‌వోలకు అందజేస్తారు. అక్కడి నుంచి తిరిగి ఆర్డీవో కార్యాలయానికి పంపుతారు. ఆర్డీవో కార్యాలయం నుంచి దరఖాస్తు చేసిన మీ సేవ కేంద్రానికి ఆర్డీవో ప్రొసీడింగ్‌ను అందజేస్తారు. ప్రొసీడింగ్‌ను తీసుకుని సంబంధిత మున్సిపాలిటీ లేదా నగరపంచాయతీ, గ్రామ పంచాయతీల్లో అందజేస్తే ఆయా స్థానిక సంస్థల్లో సదరు పేరు నమోదు చేసుకుని అప్పుడు మాత్రమే డెత్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఇంతటి తతంగం తమకు ఎలా సాధ్యమవుతుందని నిరక్షరాస్యులు, వృద్ధులు వాపోతున్నారు. వితంతు పింఛన్లకు భర్త డెత్ సర్టిఫికెట్ నిబంధనను సడలించాలని, దీనికి ప్రత్యామ్నాయంగా స్థానికంగా అధికారులతో విచారణ జరిపి అర్హులా.. కాదా అని నిర్దారించుకోవాలని కోరుతున్నారు.