భార్య చేతిలో భర్త హతం
- కూతురుతో కలిసి కర్రలతో దాడి
- ఎర్రవల్లి తండాలో ఘటన
మహబూబ్‌నగర్ క్రైం: నిత్యం తాగి వేధిస్తున్న వ్యక్తిని భార్య, కూతురు కలిసి హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని తిమ్మాసానిపల్లి శివారులోని ఎర్రవల్లి తండాకు చెందిన అంబోతు శంకర్‌నాయక్ (45)తోపాటు భార్య తులసి, కూతురు భారతితో కలిసి తండా సమీపంలోని గొల్ల జంగయ్య వ్యవసాయ పొలం వద్ద కూలీపని చేసుకుంటూ జీవిస్తున్నారు. శంకర్‌నాయక్ ప్రతిరోజు నాటుసారా తాగి భార్యాపిల్లలను వేధించేవాడు. ఈ వేధింపులు చాలారోజులుగా వేధింపులను భరించిన భార్య.. వారం క్రితం కులపెద్దలకు చెప్పింది.
దీంతో భార్యాభర్తలకు కులపెద్దలు సర్దిచెప్పారు. అయినా శంకర్‌నాయక్ తాగుడు మానకపోగా.. పంచాయితీ పెట్టిస్తావా..? అంటూ రోజూ కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. దీంతోపాటు శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పూటుగా మద్యం తాగి భార్యతో గొడవపడి ఆమెను చితకబాదాడు. దీంతో సహనం కోల్పోయిన భార్య తులసి, కూతురు భారతి కలిసి అతడిని కర్రలతో చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన శంకర్ అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడి సోదరుడు మెగ్యనాయక్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు.