చిలుకూరు : అనుమానం పెనుభూతమైంది. కల కాలం తోడునీడగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్తే కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఆదివారం చిలుకూరులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం..చిలుకూరుకు చెందిన దుగ్గెబోయిన శ్రీను అదే గ్రామంలో ఉంటున్న తన అక్క బిడ్డ వెంకటమ్మను (38) వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా కూతురు నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. కుమారుడికి ఏడాది క్రితం వివాహం చేశారు. స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న శ్రీను..
కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. అంతేకాకుండా భార్యను అనుమానిస్తుండేవాడు. ఈ క్రమంలో శనివా రం రాత్రి 10 గంటల సమయంలో భార్యతో ఘర్షణ పడ్డాడు. ఆ తర్వాత గొడవ సద్దుమనగడంతో నిద్రకు ఉపక్రమించారు. పక్క గదిలో కుమారుడు నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో శ్రీను మేల్కొని నిద్రపోతున్న అతని భార్య వెంకటమ్మ మెడపై ఇంట్లో ఉన్న కత్తితో రెండు చోట్ల నరికాడు. దీంతో వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కాసేపటికి నిద్రలేచిన కుమారుడు తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాడు. అప్పటికే అతని తండ్రి శ్రీను పరారయ్యాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఘటన స్థలిని సందర్శించిన పోలీసులు
హత్య జరిగిన ప్రదేశాన్ని కోదాడ సీఐ మెగిలయ్య, ఎస్‌ఐ రామాంజనేయులు సందర్శించారు. సంఘటన స్థలంలో ఉన్న కత్తిని, రక్తం మరకలను పరిశీలించారు. మృతురాలి కుమారుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
భార్యను కడతేర్చిన భర్త
Published Mon, Oct 13 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement
Advertisement