భార్య చేతిలో భర్త దారుణ హత్య | Wife's kills Brutal murder of husband | Sakshi
Sakshi News home page

భార్య చేతిలో భర్త దారుణ హత్య

Published Tue, Jan 13 2015 6:01 AM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM

భార్య చేతిలో భర్త దారుణ హత్య - Sakshi

భార్య చేతిలో భర్త దారుణ హత్య

వేధింపులు తాళలేక ఘాతుకం
* మృతుడిది నేర చరిత్రే
* జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే..

తాండూర్ : భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానంతో వేధించడాన్ని తాళలేక.. తనను తాను కాపాడుకోవడానికి గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధి పోచంపల్లిలో సోమవారం వేకువజామున జరిగింది. తాండూర్ సీఐ రమేశ్‌బాబు కథనం ప్రకారం.. పోచంపల్లికి చెందిన గొర్లపల్లి బుచ్చయ్య(42)కు భార్య శాంత, కూతురు లావణ్య, కుమారులు నవీన్, కల్యాణ్ ఉన్నారు. కూలీ పని చేసి జీవించే బుచ్చయ్య 2008లో భూమి విషయమై తగాదా పడి తన అన్న మల్లయ్యతోపాటు మరో వ్యక్తి దుగుట లింగయ్యలను హత్య చేసి జైలుకు వెళ్లాడు.

ఆరున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవల  విడుదలయ్యాడు. ఆరు నెలలు మంచిర్యాలలో ఉన్న బుచ్చయ్య కుటుంబం నెల రోజుల క్రితం స్వగ్రామమైన పోచంపల్లికి వచ్చింది. భార్య శాంతపై అనుమానం పెంచుకుని వివాహేతర సంబంధాలు అంటగడుతూ వేధిస్తున్నాడు. ఆదివారం కుటుంబంతో సహా చర్చికి వెళ్లి వచ్చినప్పటి నుంచి భార్యాపిల్లలతో గొడవపడుతున్నాడు. భార్యను కొడుతుండగా అడ్డుకోబోయిన పిల్లలనూ చితకబాదాడు. రాత్రంతా గొడవ జరిగింది. సోమవారం వేకువజామున భార్యతో గొడవపడి చంపుతానంటూ గొడ్డలి తీయబోయాడు.

ఈ క్రమంలో శాంత వేధింపులు తాళలేక, ప్రాణ రక్షణ కోసం పక్కనే ఉన్న గొడ్డలితో బుచ్చయ్య తల, మెడపై నరికింది. దీంతో బుచ్చయ్య కేకలు వేస్తూ బయటకు వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ రమేశ్‌బాబు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, బుచ్చయ్య పలు కేసులున్నాయి. మాదారంటౌన్‌షిప్‌లో దొంగతనం కేసు, తాండూర్, ఆషిపాబాద్ పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement