సమష్టిగా అభివృద్ధి చేస్తాం | Will be developed jointly by | Sakshi
Sakshi News home page

సమష్టిగా అభివృద్ధి చేస్తాం

Published Tue, Sep 2 2014 2:28 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

Will be developed jointly by

  • కార్యకర్తలను కాపాడుకుంటాం
  •  కేసీఆర్ సీఎంగా ఉన్నందుకు గర్వపడాలి
  •  టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సభలో డిప్యూటీ సీఎం రాజయ్య
  • హన్మకొండ సిటీ : టీఆర్‌ఎస్ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అందరం సమష్టిగా నిలిచి కార్యకర్తలకు అండగా ఉండడమే కాకుండా జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్యతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. హన్మకొండ వడ్డేపల్లిలోని పీజీఆర్ గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ అభినందన సభ జరిగింది.

    ఈ సభలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య, ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, అజ్మీరా సీతారాంనాయక్, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగం, పూల రవీందర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చందూలాల్, శంకర్‌నాయక్, ఆరూరి రమేష్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి జాటోత్ రామచంద్రు నాయక్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మ పాపిరెడ్డితో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

    టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ,  మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు, మొలుగూరి బిక్షపతి, సత్యవతి రాథోడ్, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముద్దసాని సహోదర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీజీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహన్‌రావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్, నాయకులు రాంకిషన్, రత్నాకర్‌రెడ్డి, సాదుల ప్రసాద్, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు భీరవెల్లి భ రత్‌కుమార్‌రెడ్డి, మార్నేని రవీందర్, ఎల్లావుల లలిత యాదవ్, కి షన్‌రావు, ఇంండ్ల నాగేశ్వర్‌రావు, కె.వాసుదేవరెడ్డి, నయీముద్దీన్, కమరున్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు.
     
    కంటికి రెప్పలా కాపాడుకుంటాం

    కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటామని డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నందున కార్యకర్తలందరూ ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నందుకు గర్వపడాలన్నారు. ప్రభుత్వం అమరవీరులను ఆదుకుంటుందని, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయనున్నట్లు ఆయన తెలిపారు. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్తను సైనికునిగా తయారు చేసే కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందన్నారు.

    వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలను ఎంపీలం దత్తత తీసుకుని అభివృద్ధి చేయడమే కాకుండా కార్యకర్తలకు అండ గా నిలుస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని, ఆ తర్వాత వారికి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

    భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి జాటోత్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణానికి తన శాయశక్తుల కృషి చేస్తానన్నారు.  తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మ పాపిరెడ్డి మాట్లాడుతూ నిరంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ద్వారానే తనకు ఈ పదవి వచ్చిందని తెలిపారు.

    జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతుందన్నారు. ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చందూలాల్, శంకర్‌నాయక్, ఆరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement