డ్వాక్రా రుణాల మాఫీపై అసెంబ్లీలో చర్చిస్తామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
బూర్గంపాడు: డ్వాక్రా రుణాల మాఫీపై అసెంబ్లీలో చర్చిస్తామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గం పాడు ఐకేపీ కార్యాలయంలో గురువారం బ్యాంక్ లింకేజీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... మహిళా సంఘాల ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, రుణ మాఫీ కోసం ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అమలుచేసిన పావలా వడ్డీ రుణాలు, అభయ హస్తం తదితర పథకాలు ఎంతో మేలు చేశాయని అన్నారు.
వైఎస్ హయాంలో ఆర్థికంగా బలోపేతమైన మహిళా సంఘాలు.. ఆ తరువాత వచ్చిన పాలకుల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు లేకపోవటంతో మహిళలు రుణాలు చెల్లించలేకపోతున్నారని అన్నారు. రైతులతోపాటు డ్వాక్రా రుణాల మాఫీకి ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. డ్వాక్రా మహిళలకు ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుడిలా పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు.
అనంతరం, 50 మహిళా సంఘాలకు 1.70 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీని అందజేశారు. నిరుపేద మహిళల ఉన్నతి కోసం వ్యక్తిగత రుణాల చెక్కులను కూడా ఇచ్చారు. సుస్థిర వ్యవసాయ విధానంలో పంటలు సాగు చేస్తున్న రైతు కుటుంబాలకు వ్యవసాయ యాంత్రీకరణ సామాగ్రి అందజేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఐకేపీ కార్యాలయానికి వచ్చిన పాయం వెంకటేశ్వర్లుకు మహిళాసంఘాల సభ్యులు, ఐకేపీ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ తహాశీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఐసీడీఎస్ సీడీపీఓ లెనినా, ఐకేపీ ఏరియా కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, ఏపీఎం వినోద్ క్రాంతి, ఎస్‌బీహెచ్ మేనేజర్ సంజీవ్‌కుమార్ నాయక్‌పాల్గొన్నారు.