పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు
మంత్రి అజ్మీర చందూలాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషిచేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అధికారులకు సూచించారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాగుతున్న వివిధ అభివృద్ధి పనులను సోమవారం ఆయన పర్యాటక భవన్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత పర్యాటక రంగం పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో చర్చించారు.
రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలతో పాటు అలీసాగర్ ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజంను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. కుంతాల, పాండవుల గుట్ట ప్రాంతాల్లో వాటర్‌ఫాల్స్ టూరిజం, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అక్క మహాదేవి గుహల్లో కేవ్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు, కాకతీయుల కాలం నాటి విశాలమైన చె రువులను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. నల్గొండ జిల్లాలోని బుద్ధవనం, ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీమ్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పర్యాటక రంగాన్ని పోత్సహించేందుకు ప్రతి జిల్లాలో మేనేజర్లను నియమించాలని అధికారులను ఆదేశించారు.