కార్మిక హక్కులు సాధించుకోవాలి
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్ : శ్రామిక శక్తులు సంఘటితంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రోటరీనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మేడే జెండాను ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రెక్కలు ముక్కలు చేసి అరకొర వేతనాలతో కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నా పాలకులు పట్టించుకోలేదన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరముందన్నారు. కార్మికులు నిలువనీడ లేక అష్టకష్టాలు ఎదుర్కొంటున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
వీరికి స్థలాలు కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఎంపీగా తాను విజయం సాధించి కార్మిక వర్గాల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానన్నారు. కార్మికుల సంక్షేమమే తన ధ్యేయమన్నారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం శ్రామికుల సంక్షేమానికి పాటుపడతానన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సంపెట వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షరాలు కీసర పద్మజారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి హెచ్. వెంకటేశ్వర్లు, రైతు విభాగం జిల్లా అద్యక్షుడు ఏలూరి కోటేశ్వరరావు, నాయకులు కొంగర జ్యోతిర్మయి. దోరేపల్లి శ్వేత, వేముల సీత, షకీనా, ఆరెంపుల వీరభద్రం, మేడా విజయ్‌కుమార్, మేడా శ్రీనివాసరావు, పగడాల భాస్కర్‌నాయుడు, వంటికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి, సమద్, సుజా, పత్తి శ్రీను, రిటైర్డ్ ఈఓ చక్రపు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.