
తెలంగాణలో ‘విప్రో’ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో విప్రో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ప్రకటించారు. ప్రేమ్‌జీ ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆయన అధికారిక నివాసంలో కలిశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు, తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ్‌జీ హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్‌కు వివరించారు. తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణ రాష్ట్రంలో మరింత విస్తరిస్తామని తెలిపా రు. కాగా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విధానాలను సీఎం, ప్రేమ్‌జీకి వివరించారు. ఐటీ రంగంలో హైదరాబాద్, భారతదేశానికి తలమానికమయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ర్టం అనువైన ప్రాంతంగా జాతీయ, అంతర్జాతీ య సంస్థలకు కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని ఐటీ పార్కులు వచ్చేం దుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్,సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు.