సాక్షి, హైదరాబాద్: మున్సి‘పోల్స్’నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) సమాయత్తమవుతోంది. పురపాలక సంఘాల ఎన్నికల ముందస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి హైకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఎస్‌ఈసీ దానికి తగ్గట్టుగా ప్రాథమిక కసరత్తును పూర్తి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నగర/పురపాలికల రిజర్వేషన్ల జాబితా అందగానే ఎన్నికల నగారా మోగించాలని భావిస్తోంది. పంద్రాగస్టులోపే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా, వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు పలు కేసులు హైకోర్టులో దాఖలు కావడం.. ఎన్నికలను నిలుపుదల చేస్తూ కోర్టు స్టే ఇవ్వడం తెలిసిందే.
వారం క్రితం ఈ పిటిషన్లను విచారించిన కోర్టు.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు కసరత్తుకు అనుమతినిస్తూ..తుది తీర్పును దసరా అనంతరం వెలువరిస్తామని ప్రకటించింది. ఒకట్రెండు రోజుల్లో ఈ తీర్పు వెలువడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తీర్పు వచి్చన మరుక్షణమే రిజర్వేషన్ల ఖరారు విధివిధానాలను విడుదల చేయనున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువడటానికి ముందే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు పనులు, ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌ఈసీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment