నల్లగొండ: సాగర్ ఎడమ కాలువలో జారిపడి భార్య మృతి చెందగా, భర్త గల్లంతయ్యాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లిలో సోమవారం మధ్యాహ్నం 12గంటలకు జరిగింది. వివరాలు.. వేములపల్లికి చెందిన గంజి సత్యం అంత్యక్రియలకు ఆయన కూమార్తె పద్మ(33), అల్లుడు నరేందర్(38)లు సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం స్నానం చేసేందుకు సాగర్ ఎడమ కాలువలోకి దిగారు. ఆ ప్రాంతంలో నీటి ఉధృతి వేగంగా ఉండటంతో వారు గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారికి ఈత రాకపోవడంతో నీటిలో కొట్టుకుపోయినట్లు వారు చెప్పారు. ఈ ప్రమాదంలో నరేందర్ గల్లంతు కాగా, పద్మ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(వేములపల్లి)