నెల్లికుదురు : భర్త అడుగులో అడుగేస్తూ ఏడడుగులు నడిచిన ఓ మహిళ ప్రియుడి వెంట వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఆరు రోజు ల క్రితం అదృశ్యమైన ఆమె సమీపంలోని గుట్టల్లో శవమై కనిపించింది. మండలంలోని మేచరాజుపల్లి శివారు కొత్తూరు తండాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలి భర్త భూక్య వీరన్న, తండావాసుల కథనం ప్రకారం.. మండలంలోని మేచరాజుపల్లి గ్రామశివారు కొత్తూరు తండాకు చెందిన బాదావత్ కేస్లీ, బీక్యా దంపతుల కుమార్తె కాంతి(30)కి పర్వతగిరి మండలం ఏనుగల్లు తండాకు చెందిన భూక్య బిచ్చా, బద్రి దంపతుల కుమారుడు వీరన్నతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత వీరన్న అత్తగారింటికి ఇల్లరికం వచ్చి కొత్తూరు తండాలోనే నివాసముంటున్నాడు.
వారికి కుమారులు అనిల్, ప్రవీణ్ ఉన్నారు. కాగా ఇదే తండాకు చెందిన బాదావత్ రవితో కాంతి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. పలుమార్లు తండాలో పంచాయితీ పెట్టి వీరిద్దరిని హెచ్చరించినా వారిలో మార్పురాలేదు. ఈ క్రమంలో ఈ నెల 15న నెల్లికుదురు తహసీల్ కార్యాలయానికి వెళ్లొస్తానని చెప్పిన కాంతి తిరిగి రాలేదు. దీంతో బంధువులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే ఆమె భర్త వీరన్న తండాకు చెందిన బాదావత్ రవితోపాటు కొంతమందిపై అనుమానం ఉన్నట్లు ఈ నెల 17న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రవిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
కొత్తూరుతండా సమీపంలో రెండు కిలోమీటర్ల దూరంలోని అడవిలో ఉన్న అడ్డగట్టు గుట్ట మీదకి తీసుకెళ్లి హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. దీంతో తొర్రూరు సీఐ సార్ల రాజు, నెల్లికుదురు ఎస్సై బెల్లం చేరాలు, గ్రామస్తులు తండావాసులు నిందితుడు రవితో వెళ్లి వెతకగా గుట్ట మీద 15 ఫీట్ల లోతున్న సొరంగంలో కాంతి మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. పోలీసులు అతికష్టం మీద మృతదేహాన్ని వెలికి తీసి గుట్ట కిందకు తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. కడసారి చూపు కోసం కాంతి పిల్లలు మృతదేహం వద్దకు తండ్రితోపాటు వచ్చి దూరం నుంచి బోరున విలపించడం చూరులను కంతడి పెట్టించింది.
ప్రియుడి చేతిలో మహిళ హతం
Published Wed, Oct 22 2014 3:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement