వరంగల్ : మావోయిస్టు పార్టీ పశ్చిమ బస్తర్ ఏరియా డివిజనల్ కమిటీ సభ్యురాలు నిమ్మల సారమ్మ అలియాస్ జ్యోతి అలియాస్ శారద బుధవారం వరంగల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా జనగామ మండలం షామీర్‌పేటకు చెందిన నిమ్మల సారమ్మ తన 12వ ఏటనే మావోయిస్టు పార్టీ సాహిత్యానికి ఆకర్షితురాలై 1990-91లో ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ దళం సభ్యురాలిగా చేరింది.
ఏటూరునాగారం-గుండాల దళ సభ్యురాలిగా కూడా పనిచేసింది. పలు హత్యలు, పేలుళ్ల ఘటనల్లో నిందితురాలైన ఆమె బుధవారం వరంగల్ ఎస్పీ ఎదుట లొంగిపోయింది. పార్టీలో అంతర్గత విభేదాలు, అనారోగ్య సమస్యలే ఆమె లొంగుబాటుకు కారణమని తెలుస్తుంది. కాగా ఆమెపై ఉన్న రూ.5 లక్షల రివార్డును ఆమెకు అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.