
రాజకీయ సమీకరణాల వల్లే..
సాక్షి, హైదరాబాద్: ‘ఈ ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకమ’న్న కాంగ్రెస్ సభ్యుడు రంగారెడ్డి ఆరోపణపై శుక్రవారం శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. సభలోనే ఉన్న ఐటీ, పంచాయతీరాజ్‌శాఖా మంత్రి కె.తారక రామారావు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ‘మహిళలకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేని మాట వాస్తవమే. కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల కేబినెట్‌లోకి తీసుకోకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన మహిళలపై గౌరవం లేదని సభ్యుడు ఆరోపించడం తగదు’ అని వ్యాఖ్యానించారు. అయినా డిప్యూటీ స్పీకర్, పార్లమెంటరీ సెక్రటరీ వంటి పదవులు ఇచ్చామన్నారు. అలాగే నాలుగు జిల్లాలకు మహిళా కలెక్టర్లను నియమించిన ఘనత తమదేనన్నారు. మహిళా రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అంగన్‌వాడీలకు రూ. 4,600 నుంచి రూ. 7 వేల వరకు వేతనాలు పెంచామన్నారు. 2 లక్షల మంది బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నామన్నారు. మహిళలపై గౌరవం లేదని అనడం వల్లే ఇవన్నీ మాట్లాడాల్సి వస్తోందని... తానేమీ ముందుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కేటీఆర్ వివరించారు. ఇలా పరస్పర వాదనలతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. దీనిపై ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ స్పందిస్తూ... ఇలా పరస్పర ఆరోపణలు చేసుకోవడం తగదన్నారు. ‘మీ ఒత్తిడులు మీకుండొచ్చు. అందువల్ల మహిళలను క్యాబినెట్‌లోకి తీసుకోకపోయి ఉండొచ్చు. అయినా అది మీ ఇష్టం. మహిళలకు వ్యతిరేకం అని మా సభ్యుడు అన్న విషయాన్ని రికార్డుల్లోంచి తీసేస్తే నాకేమీ అభ్యంతరం లేద’ని డీఎస్ విజ్ఞప్తి చేశారు. అలాగే వాటర్‌గ్రిడ్ పథకం వాటర్ పైపుల కాంట్రాక్టర్ల కోసమేనన్న విమర్శలపైనా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. వాటర్‌గ్రిడ్‌పై అనుమానం ఉంటే రెండు గంటలపాటు చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ‘రక్షిత తాగునీరు హక్కు’గా తేవాలనేది తమ ఉద్దేశమన్నారు. అది గుజరాత్‌లోనూ విజయవంతమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ సురక్షిత మంచినీరు ఇచ్చివుంటే నల్లగొండలో ఫ్లోరోసిస్ ఉండేదా అని నిలదీశారు. కాంగ్రెస్ సభ్యుడు రంగారెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను పక్కన పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఈ ప్రాజెక్టు చేపడితే వాటర్‌గ్రిడ్ కంటే పెద్దది అవుతుందని రంగారెడ్డి అన్నారు. బోగస్ ఇళ్లు, అక్రమాలు తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగాయని తేలితే చార్మినార్ వద్ద ఉరి తీయండని కోరారు.
టీఆర్‌ఎస్ సభ్యుడినా అనిపించింది...
అంకెలు ఘనంగా ఉన్నాయి... కానీ ప్రాధాన్యాలు సరిగ్గా లేవని టీడీపీ సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినప్పుడు నాకు నేను ‘నేను కూడా టీఆర్‌ఎస్ సభ్యుడినా అన్న ఫీలింగ్ కలిగింది’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అధికార పార్టీ సభ్యులు కంగుతిన్నారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు కచ్చితంగా కనీస మద్దతు ధర అందేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి పోట్ల అనేక విమర్శలు చేయగా... ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు లేకుండా పోయిందన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగే పరిస్థితి లేదన్నారు. ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు సాధారణ కానిస్టేబుల్, హోంగార్డ్ వంటి చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండటం ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి నిలువెత్తు ఉదాహరణగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 163 ఇంజనీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు రద్దు చేశామన్నారు. మరో 125 కళాశాలల పూర్తి సమాచారాన్ని తీసుకున్నామన్నారు. మొత్తం 288 ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితిని ఆన్‌లైన్‌లో పెడతామని కడియం పేర్కొన్నారు. ‘మీకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. కాబట్టి మేనేజ్‌మెంట్ల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడొద్దని’ టీడీపీ సభ్యుడు పోట్లకు కడియం శ్రీహరి సూచించారు. దీంతో పోట్ల మనస్తాపానికి గురై తన కాలేజీని మూయించాలని అనుకుంటున్నారని... ఇక దీనిపై తాను మాట్లాడనని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచి, జెడ్పీ చైర్మన్లకు వేతనాలు పెంచడం రాజకీయ నిర్ణయమని పోట్ల విమర్శించగా... తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందా? అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. సభలో మంత్రి జోగు రామన్న కూడా మాట్లాడారు. సభ్యులు కర్నె ప్రభాకర్ బడ్జెట్‌పై ప్రసంగం ప్రారంభించారు. ఈ సభలో మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపునకు సంబంధించి ప్రకటన చేశారు. ఎవరికి ఎంతెంత పెరిగింది వివరాలు వెల్లడించారు.