అక్కా నన్ను బదిలీ చేయించు
ఎంపీ కవితకు మహిళా డ్రైవర్ సరిత వినతి
సంస్థాన్ నారాయణపురం: ‘‘అక్కా నేను తెలంగాణ బిడ్డనే.. నన్ను ఢిల్లీ నుంచి ఇక్కడికి బదిలీ చేయించు’’ అని దేశంలోనే మొదటి మహిళా డ్రైవర్ అయిన వాంకుడోతు సరిత విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో కవితను కలసి వినతిపత్రం సమర్పించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం సీత్యతండాకు చెందిన సరితకు మూడేళ్ల నుంచి ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలోని సరోజిని డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తోంది. తల్లిదండ్రుల బాధ్యత ఉండడంతో రెండుమూడు నెలలకోసారి ఇంటికి వచ్చి వెళుతోంది. దీంతో ఇబ్బందులు ఎదురవుతుండడంతో సంస్థాన్ నారాయణపురం జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్ సహకారంతో హైదరాబాద్‌లో కవితను కలిసింది.