ఒకపక్క కీచురాళ్ల రొద.. ఇంకోపక్క ఝుమ్మంటూ తూనీగలు.. పచ్చటి గరిక, గడ్డిలో ఎర్ర ఎర్రటి ఆరుద్రలు! చిమ్మచీకట్లో పచ్చటి వెలుగులు జిమ్ముతూ మిణుగురులు! వాన చినుకుకు తడిసిన మట్టిలోంచి ఆత్రంగా బయటకొస్తూ.. వానపాములు! అగ్గిపెట్టెల్లో దాచుకుని మురిసిపోయిన బంగారు పురుగులు పేడ పురుగులు.. ఉసిళ్లు...తేనెటీగలు..అబ్బో చెప్పుకుంటూ పోతే.. పురుగుల పేర్లు సహస్రం దాటేస్తాయి! కానీ.. ఇదంతా ఒకప్పటి మాట! ప్రకృతి గత వైభవం! పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇంకొన్నేళ్లకు.. ఈ భూమ్మీద పురుగన్నది లేకుండా పోతుంది. సోవాట్.. పురుగుల్లేకపోతే మనకేమిటి నష్టం?
ఈ భూమ్మీద ఉండే 700 కోట్లపై చిలుకు మనుషుల కంటే పురుగుపుట్ర బరువు 17 రెట్లు ఎక్కువ అని! సముద్రాలు, చెరువుల్లోని జలచరాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ క్రిమి కీటక సామ్రాజ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ విషయం చాలా కాలంగా వింటున్నదే అని అంటున్నారా.. అయితే ఇదిగో తాజా వార్త. కొన్ని దశాబ్దాల్లో ఉన్న కీటకాల్లో కనీసం 40 శాతం కనిపించకుండా పోతాయని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం ఒకటి.
బయలాజికల్ కన్సర్వేషన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ప్రమాదం ఒక్క తేనెటీగలకే పరిమితం కాలేదు.. సీతాకోకచిలుకలు, పేడ పురుగులు కూడా వినాశనం అంచుల్లో ఉన్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో ఈ చిన్ని జీవాల పాత్రను గుర్తించకపోయినా.. కాపాడుకునే ప్రయత్నం చేయకపోయినా.. మనిషి మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదముందని స్పష్టం చేస్తోంది. గత 40 ఏళ్లలో జరిగిన 73 వేర్వేరు పరిశోధనల ఫలితాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. భూమ్మీది మొత్తం పురుగుల బరువు ఏటా 2.5% చొప్పున తగ్గుతోందని.. అమెరికా సహ అనేక దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది ప్రపంచ సమస్యే అన్నది సుస్పష్టం.
కారణాలేమిటి?
కీటక జాతుల నాశనానికి 4 కారణాలు ఉన్నా యని అంటున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా చెప్పుకోవాల్సింది... ఆవాస ప్రాంతాల నష్టం. అడవులు, చెట్లు.. పచ్చిక బయళ్లు.. వంటివి తగ్గిపోవడం, భూములను వ్యవసాయానికి వాడుకోవడం ఎక్కువ కావడం వంటివన్న మాట. రెండో కారణం.. వ్యవసాయం లో కీటకనాశినుల వాడకం పెరగడం. శిలీంధ్రాల కోసం ఫంగిసైడ్, చిన్న చిన్న పురుగుల కోసం పెస్టిసైడ్స్, కీటకాల కోసం ఇన్‌సెక్టిసైడ్స్.. ఇలా వేర్వేరు పేర్లతో వాడుతున్న రసాయనాలు భూమిని.. పరిసరాల్లోని పురుగులను నాశనం చేసేశాయన్నది నిర్వివాద అంశం. ఇప్పటివరకూ నశించిపోయిన కీటకాల్లో 8 శాతం కీటకనాశినుల కారణంగానే అని అధ్యయనం చెబుతోంది.
ఎరువులు, పారిశ్రామిక వ్యర్థాలు మూడో కారణమైతే.. మారిపోతున్న వాతావరణం ఇంకో కారణమని తేల్చింది. వీటితోపాటు.. ఇన్వెసివ్ స్పీషీస్ (ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించి.. సహజ శత్రువులు లేనికారణంగా విచ్చలవిడిగా పెరిగే జీవజాతులు), పరాన్నజీవులు, వ్యాధులూ కీటకాల సంతతి తగ్గిపోయేందుకు దోహ దపడుతున్నాయి. మరి ఏం చేద్దాం? నశించిపోతున్న కీటకజాతిని రక్షించుకునేందుకు మనుకున్న సులువైన ఉపాయం సేంద్రీయ ఆహారం వాడకాన్ని ఎక్కువ చేయడమే. పరిసరాల్లో వీలైనన్ని ఎక్కువ జాతుల మొక్కలను పెంచితే.. అవి కాస్తా కీటకాలకు ఆవాసంగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
వీటిఅవసరమేమిటి?
కీటక జాతులు తగ్గిపోతుండటం పర్యావరణానికి జరుగుతు న్న నష్టానికి సూచిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. వానపాములనే తీసుకుంటే.. మట్టిని తిని అవి విడిచే వ్యర్థాలు భూమిని సారవంతం చేస్తాయి. వీటిమాట ఇలా ఉంటే.. మిగిలిన పురుగులు కీటకాలు.. ఆహార పిరమిడ్‌లో అట్టడుగున ఉంటూ.. మిగిలిన పక్షులు, జంతువులకు ఆహారంగా మారతాయి. పరపరాగ సంపర్కం ద్వారా పూల పుప్పొడిని, విత్తనాలను సుదూర ప్రాంతాలకు విస్తరించడంలోనూ వీటి పాత్ర చాలా ముఖ్యం. ఇలాంటి పర్యావరణపరమైన సేవలన్నింటికీ విలువ కడితే.. అది ఏటా కొన్ని కోటానుకోట్లకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతటి కీలకమైన పురుగులు నాశనమైపోతే పర్యావరణ సమతౌల్యత దెబ్బతినడం ఖాయం. కన్యా శాస్త్రవేత్త డినో మార్టిన్స్ మాటల్లో చెప్పాలంటే.. ‘కీటకాల్లేపోతే.. ఆహారమే లేదు... అంటే మనుషులే లేరు’.
Comments
Please login to add a commentAdd a comment