కూతురి ఆచూకీ తెలియక దిగులు | Worried, not knowing the whereabouts of the child, | Sakshi
Sakshi News home page

కూతురి ఆచూకీ తెలియక దిగులు

Published Mon, Oct 27 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

కూతురి ఆచూకీ తెలియక దిగులు

కూతురి ఆచూకీ తెలియక దిగులు

పహాడీషరీఫ్: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న కుటుంబానికి ఆసరాగా ఉందామని జల్‌పల్లి శ్రీరాం కాలనీ నుంచి ఖతార్ దేశానికి వెళ్లిన ఓ యువతి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.  యువతి తల్లి మాధవి ‘సాక్షి’కి తెలిపిన వివరాల ప్రకారం... మాధవి భర్త సత్యనారాయణ 8 ఏళ్ల క్రితం చనిపోయాడు.

రెండేళ్ల క్రితం కుమారుడు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాధవికి ఆసరా ఉండేందుకు ఆమె కుమార్తె లత (22) ముందుకొచ్చింది. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె ఏదైనా ఉద్యోగం చేస్తానని గతేడాది అక్టోబర్‌లో పాస్‌పోర్టు తీసుకుంది. తన ఇంటి ముందు ఉండే ఒడిశా వాసి విదేశాలకు వెళ్తే మంచి జీతం ఇస్తారని చెప్పాడు. తన మిత్రుడు విదేశాలకు పంపిస్తాడని చెప్పి చార్మినార్‌కు చెందిన రషీద్‌ను మాధవి, లతలకు పరిచయం చేశాడు.

ఖతార్‌లో తన వదిన స్నేహితురాలి ఇంట్లో పనిచేస్తే నెలకు రూ. 13 వేలు ఇస్తారని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఆమె ఈ ఏడాది జనవరిలో ఖతార్ వెళ్లింది. అనంతరం వారం.. పది రోజులకోసారి తల్లి మాధవితో ఫోన్‌లో మాట్లాడి బాగానే ఉన్నానని చెప్పేది. కాగా నెలన్నర క్రితం చివరిసారిగా తల్లికి ఫోన్ చేసిన లత.. ‘అమ్మా నాతో నాలుగు ఇళ్లల్లో పని చేయిస్తున్నారు....ఇక్కడ నరకం కనిపిస్తోంది... చంపేసేలా ఉన్నారు....మా మేడం గుండె ఆపరేషన్ కోసం యూరఫ్ వెళ్లింది...రషీద్ వాళ్ల వదిన నన్ను కర్రతో కొడుతోంది....ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లు’.. అని రోదిస్తూ చెప్పింది. వెంటనే మాధవి రషీద్‌ను సంప్రదించగా దుర్భాషలాడాడు.

రషీద్ వదిన కూడా ఫోన్‌లో అదుబాటులోకి  రాకపోవడంతో మాధవి చివరకు పహాడీషరీఫ్ పోలీసులను ఆశ్రయిం చింది.  పోలీసులు మాధవి వెంట ఇద్దరు కానిస్టేబుళ్లను ఇచ్చి రషీద్ ఇంటికి పంపగా అతను  ఆ ఇంట్లో లేడు. అదే సమయంలో లత యజమానురాలు మాధవికి ఫోన్ చేసి..  మీ కుమార్తెను బక్రీద్ తర్వాత ఇండియాకు పంపిస్తా,  ఇలా అర్థంతరంగా పంపించాలంటే ఇంట్లో ఎవరైనా చనిపోయారని చెప్పాలని సూచించింది. దీంతో మాధవి తానే చనిపోయినట్టు ఫొటోలు తీయించి మెయిల్‌లో ఖతార్‌కు పంపించింది.

బక్రీద్ అనంతరం ఫోన్ చేయగా ఎవరూ కూడా అందుబాటులోకి రాకపోవడంతో మాధవి మరింత ఆందోళనకు గురైంది. దీంతో ఆందోళనకు గురైన ఆమె ఆదివారం పోలీసులను మరోసారి కలిసి తన కుమార్తె ఆచూకీ గుర్తించి, ఎలాగైనా నగరానికి రప్పించాలని కోరింది.  కాగా, ఆధార్ కార్డు, ఫొటోలు తీసుకొస్తే సోమవారం కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆమె ఇంటికి తిరిగి వెళ్లిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement