గవర్నర్ పదవిపై యనమల ఆసక్తి!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో విపక్ష నేత, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు గవర్నర్ పదవిపై దృష్టి సారించారు. సీమాంధ్రలో ఆ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆయన్ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ప్రచారం బలంగా జరుగుతోంది. అయితే యనమల మాత్రం గవర్నర్ పదవిపై ఆసక్తితో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు తన ఆకాంక్షను సన్నిహితుల వద్ద ఆయన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఎన్‌డీఏ కూటమి ఈనెల 26న కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో గతంలో యూపీఏ ప్రభుత్వం ద్వారా గవర్నర్లుగా నియమితులైన పలువురు రాజీనామాలు సమర్పించే యోచనలో ఉన్నారు. మొత్తం 15 వరకు రాష్ట్రాల్లో గవర్నర్ పదవులు ఖాళీ కానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏదో ఒక రాష్ట్రానికి తనను గవర్నర్‌గా పంపించాల్సిందిగా యనమల ఇప్పటికే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారని, బాబు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉన్న విషయం విదితమే.