హోదాలో ఏమీ లేకపోతే 15 ఏళ్లు ఎందుకడిగారు?
చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆర్‌కే రోజా
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ లేకపోతే 15 ఏళ్ల పాటు కావాలని ఎందుకు కోరారు? టీడీపీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.కె.రోజా సీఎం చంద్రబాబును ప్రశ్నిం చారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురూ ఒట్టు పెట్టుకుని హోదా ఇస్తామని చెప్పి భగవంతుడికే పంగనామాలు పెట్టారని మండిపడ్డారు.
హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోతే అసెంబ్లీ లో రెండుసార్లు తీర్మానాలు ఎందుకు చేశా రు? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 2014 జూన్ 20న జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో గవర్నర్‌కు రాసిచ్చిన ప్రసంగంలో రాష్ట్రానికి పదేళ్లు కాదు, 15ఏళ్లు హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరడమైనది అని ఎందుకు పేర్కొన్నారు? ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను అనుసరించి 15 సంవత్సరాల కాలా నికి పారిశ్రామిక పోత్సాహకాలు, రాయితీలు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు గవర్నర్ చదివిన ప్రసంగంలోనే ఎందుకు పొందుపర్చారు? అని రోజా ప్రశ్నిస్తూ నాటి ప్రసంగం ప్రతిలోని వివరాల్ని చదివి వినిపించారు. హోదాతో లాభం ఏమిటంటున్న బాబు తన పార్టీ నేతలైన సుజనా చౌదరి, గల్లా జయదేవ్, జీవీఎస్ ఆర్ ఆంజనేయులు, సీఎం రమేష్‌ను అడిగితే ఆ ప్రయోజనాలేమిటో చెబుతారన్నారు. వీరంతా హోదాగల రాష్ట్రాల్లో పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారో అడగాలన్నారు.