
మంథని యువకుడి మృతిపై న్యాయవిచారణ
ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథనిలో మాదిగ యువకుడు మధుకర్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం డిమాండ్ చేశారు. మార్చి 14వ తేదీన మధుకర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధుకర్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురయ్యాడని తమకు అందిన సమాచారం ప్రకారం అర్ధమవుతున్నదని పేర్కొన్నారు.
మార్చి 13న ఇంటి నుండి బయలుదేరిన మధుకర్ మరునాడు శవమయ్యాడని, ఇతర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినందుకు మధుకర్‌పై దాడి చేసి చంపినట్టు కనబడుతున్నదని పేర్కొన్నారు. కళ్లు పీకేసి, పక్కటెముకలు విరగ్గొట్టి, మర్మాంగాలు కోసి మధుకర్ ను అతిదారుణంగా హత్య చేసినట్టుగా స్పష్టమవుతోందని కోదండ రాం పేర్కొన్నారు. పలుకు బడిగల నాయకుల జోక్యంతో దీన్ని పోలీసు అధికారులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, పైన చెప్పిన విధంగా తనను తాను హింసించుకోవడం సాధ్యం కాదని అన్నారు. బాధితులకు న్యాయం జరుగాలంటే శవాన్ని వెలికితీసి రీ–పోస్ట్ మార్టం చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.