సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నిరుద్యోగులకు పట్టలేనంత ఆనందం. ఉద్యోగాల భర్తీ కోసం వయోపరిమితిని ఐదేళ్లు సడలిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం చేసిన ప్రకటనతో వారిలో సరికొత్త ఉత్సాహం. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలుడిగిన నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఊరట. వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీ పోస్టులను గత కొన్ని సంవత్సరాలుగా భర్తీ చేయడం లేదు.
సంవత్సరాల తరబడి ఉద్యోగాల భర్తీ కోసం ఎలాంటి నోటిఫికేషన్ వెలవడకపోవడంతో జిల్లాలోని యువకులు నిరుద్యోగులుగానే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమ తలరాతలు మారుతాయనే ఆశతో ఉన్న నిరుద్యోగుల కల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ఫలించినట్టయింది. వేలాది మంది నిరుద్యోగులు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు.
ఆ 20వేల మందిలో..
జిల్లాలో వేల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. వారిలో 34 ఏళ్లకు పైబడిన వారు 20వేలకు పైగా ఉంటారని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే గరిష్ట వయసును 34 నుంచి 5 సంవత్సరాలు పెంచడంతో 39 ఏళ్లకు చేరింది. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదు.
రిటైర్మెంట్‌పోస్టులను సైతం యథావిధిగా ఖాళీగానే ఉంచుతున్నారు. పలు ప్రభుత్వ శాఖలు సిబ్బంది కొరతతో ప్రజల సమస్యలను తీర్చలేక సతమతమవుతున్నాయి. ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇప్పటి వరకు ఈ ఖాళీలను భర్తీ చేయకలేక పోయింది. త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఈ వయో పరిమితి సడలింపు జిల్లాలోని నిరుద్యోగులకు వరంగా మారనుంది.
నాలుగైదు సంవత్సరాలుగా రాష్ట్రస్థాయిలోనూ చెప్పుకోతగ్గ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయలేదు. పెద్దగా నోటిఫికేషన్‌లు సైతం వెలువడలేదు. నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షలకు సంవత్సరాల నుంచి కోచింగ్‌సెంటర్‌లలో కోచింగ్ తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. వికలాంగులు, వివిధ సామాజిక వర్గాలు, ఇన్ సర్వీస్ ఉద్యోగులకు సైతం ఈ వయో పరిమితి సడలింపు వర్తిస్తుండటంతో వారందరిలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది.
భారీగా ఖాళీలు..
జిల్లాలో ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) స్థాయి ఉద్యోగుల నుంచి సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగాలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగాలు గత కొన్ని సంవత్సరాలుగా భర్తీకి నోచుకోవడం లేదు. జిల్లాలో ప్రధాన ప్రభుత్వశాఖగా ఉండి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన రెవెన్యూ శాఖలో సైతం భారీగానే ఉద్యోగ ఖాళీలున్నాయి. ఆరు తహశీల్దార్ పోస్టులు, నాలుగు సీనియర్‌అసిస్టెంట్ పోస్టులు, ఏడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 30 వీఆర్‌వో పోస్టులు, 8 అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పంచాయతీరాజ్ విభాగంలో రెండు ఎంపీడీవో పోస్టులు, ఒక సూపరింటెండెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, 160 అటెండర్ పోస్టులు, ఒక డీఈఈ, 34 మంది సెక్షన్ ఆఫీసర్లు, ఒక టెక్నికల్ అధికారి, రెండు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక జిల్లాలోని గ్రామస్థాయిలో పాలన వ్యవహారాలను చూడాల్సిన జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో ఏకంగా ఆరునెలలుగా జిల్లా పంచాయతీ అధికారి పోస్టు ఖాళీగా ంటోంది. 388 మంది పంచాయతీ సెక్రటరీలు, ఒక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖజానా శాఖలో అన్ని విభాగాల్లో కలిపి 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆర్‌అండ్‌బీ శాఖలో ఏడు ఏఈ , ఐదు జేటీవో, ఒక సూపరింటెండెంట్ , ఐదు సీనియర్ అసిస్టెంట్, ఏడు టైపిస్ట్, ఆరు అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం నగర పాలక సంస్థ పరిస్థితి సైతం ఉద్యోగాల విషయంలో పేరుగొప్ప అన్న సామెతను తలపిస్తోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా రూపాంతరం చెందినా అందుకు తగ్గ సిబ్బందిని మాత్రం ఇప్పటి వరకు నియమించలేదు.
అంతేకాదు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో ఉండాల్సిన పూర్తిస్థాయి సిబ్బంది ఇక్కడ లేకపోవడం గమనార్హం. ఈ శాఖలో సైతం కీలకమైన మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, సెక్రటరీ, అసిస్టెంట్ కమిషనర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గత నాలుగు నెలలుగా ఖమ్మం నగర పాలక సంస్థకు కమిషనర్ లేకపోవడంతో మెప్మా పీడీని ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయి.
భద్రాచలం ఐటీడీఏలో..
భద్రాచలం ఐటీడీఏలో కీలక శాఖలకు ప్రస్తుతం అధికారులు లేరు. వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, ఉద్యాన శాఖ, ఉపాధి కార్యాలయం, మత్స్యశాఖ, మొబైల్ కోర్టు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, గురుకుల సెల్, ఏటీడబ్ల్యూవో విభాగాలకు అధికారులు లేరు. ఇవి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఏజెన్సీ డీఈవోకు బదిలీ అయింది. ఈయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు.
కొలువుల ఆశ
Published Wed, Nov 26 2014 3:13 AM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM
Advertisement
Advertisement