
ప్రాణహిత–చేవెళ్ల పథకానికి కామారెడ్డిలో శంకుస్థాపన చేస్తున్న దివంగత సీఎం వైఎస్ (ఫైల్)
సాక్షి, కామారెడ్డి: మహానేత మనల్ని వదిలి తొమ్మిదేళ్లు గడిచాయి. కానీ ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ అందరి హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. వైఎస్సార్ అన్న పేరు వినిపిస్తే చాలు ఆయన అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడుతాయి. ప్రతిపక్ష నేతగా జిల్లాలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపి అందరి హృదయాలను చూరగొన్నారు. అంతేకాదు ఈ ప్రాంత ప్రజల సాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రాణహిత–చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు మొదలైన పనులు ఇప్పుడిప్పుడూ ఓ కొలిక్కి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో పనులు పూర్తయి రైతుల కష్టాలు తీరనున్నాయి. నేడు వైఎస్ వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
కామారెడ్డి జిల్లా అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది దుబాయ్ వలసలు, రైతుల ఆత్మహత్యలు. సాగునీటి కోసం బోర్లు తవ్వించి అప్పుల పాలై ఆత్మహత్యల బాట పట్టిన రైతుల కుటుంబాలను.. పాదయాత్ర సందర్భంగా పరామర్శించిన వైఎస్సార్ రైతు కుటుంబాలను చూసి చలించి పోయారు. ఆత్మహత్యలకు సాగునీటి సమస్యే కారణమని గుర్తించారు. ఆ కుటుంబాల కన్నీళ్లు తుడవాలంటే సాగునీరు అందించాలని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సర్వేలు చేయించి ప్రాణహిత–చేవెళ్ల పథకానికి జీవం పోసిన ఆయన.. ఈ పథకానికి శంకుస్థాపన కూడా చేశారు. 22వ ప్యాకేజీలో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ల తో పాటు మెదక్ జిల్లాలోని కొన్ని మండలాల్లో కలిపి 1.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు గాను రూ.1446 కోట్లు మంజూరు చేశారు.
దీంతో అప్పట్లోనే భూంపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టారు. కాలువల తవ్వకం పనులు కూడా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో పనులు ఆపేశారు. దీంతో కొన్నాళ్లపాటు పనులు ఆగిపోయాయి. అన్ని రకాల పరిశీలన అనంతరం 22వ ప్యాకేజీని అలాగే కొనసాగించాలని నిర్ణయించా రు. అదనంగా 44 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం భూంపల్లి రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. కాలువల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. భూంపల్లి రిజర్వాయర్ ద్వారా రైట్ కెనాల్, లెఫ్ట్‌కెనాల్, రిడ్జ్ కెనాల్స్ ద్వారా ఆయా ప్రాంతాలకు సాగునీటిని అందిస్తారు.
కామారెడ్డి ప్రజల దాహార్తి తీర్చిన భగీరథుడు
గుక్కెడు తాగునీటికి అనేక కష్టాలు పడ్డ కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చిన అపర భగీరథుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రజలు గుర్తుకు చేసుకుంటారు. కామారెడ్డి పట్టణంతో పాటు వందకు పైగా గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని వైఎస్ మంత్రివర్గం లో పని చేసిన ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ కోరిన వెంటనే రూ.140 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని కామారెడ్డి ప్రాంతానికి అందించేందుకు పనులు చేపట్టారు. తరువాత మరో రూ.66 కోట్లు మంజూరు చేసి పనులు నిర్వహించారు. ఈ పథకం ద్వారానే ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలో ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. గోదావరి నీరు ఇప్పుడు ప్రతీ ఇంటికి అందుతున్నాయి.
అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర..
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా కామారెడ్డి జిల్లాకు పలుమార్లు వచ్చారు. కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో పలుమార్లు పర్యటించారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు అందించగానే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి కృషి చేశారు. జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు భారీగా నిధులు మంజూరు చేశారు. సాగు నీటి రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అలాగే రోడ్ల అభివృద్దికి కృషి చేశారు.
రాజన్నను మరువని జిల్లా ప్రజలు..
ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫించన్లు, 108 అంబులెన్సులు వంటి పథకాలను అందించిన దివంగత సీఎం వైఎస్సార్‌ను ప్రజలు మరిచిపోరు. వైఎస్సార్ అందించిన పథకాలను ఇప్పటికీ చాలా మంది నెమరువేసుకుంటున్నారు. అలాగే లబ్దిపొందిన ఎంతో మంది నిత్యం వైఎస్సార్‌ను తలచుకుంటారు. ప్రధానంగాయ ఆరోగ్యశ్రీతో ఆపరేషన్లు చేయించుకుని పునర్జన్మ పొందిన ఎంతో మంది వైఎస్సార్‌కు తమ గుండెలో గుడికట్టుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుతో తమ బిడ్డలు ఉన్నత చదువులు చదివారంటూ చాలా మంది తల్లిదండ్రులు వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment