
సర్పంచ్ చిలకరాజు సునీతను ఆశీర్వదిస్తున్న వైఎస్‌ఆర్ (ఫైల్)
నల్లగొండ :ఆయన పేదల పెన్నిధి. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. నాయన ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు పాదయాత్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు వారికి అవసరమైన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాంటి మహావ్యక్తి మనల్ని విడిచి 10 సంవత్సరాలు పూర్తవుతోంది.
సొరంగ మార్గం
జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గానికి అప్పట్లో నిధులు విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సొరంగ మార్గం కోసం పట్టుబట్టారు. దీంతో ఆయన సొరంగ మార్గం చేపట్టేందుకు రూ.3వేల కోట్లు మంజూరు చేసిన మహానాయకుడు. నేడు ఆ పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ విషయంలో వైఎస్ తీసుకున్న చొరవ జిల్లా ప్రజలకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్‌కు కూడా తాగునీటికి భవిష్యత్‌లో ఇబ్బంది ఉండదు. సొరంగ మార్గం పూర్తయితే నల్లగొండ జిల్లాలో ఫ్లోరిన్ సమస్య పరిష్కారం కావడంతో పాటు సాగునీరు కూడా గ్రావిటీ ద్వారానే రానుంది.
బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్
ప్రపంచంలో ఎత్తిపోతల పథకంపై మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది లేదు. కాని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోరాడి వైఎస్ నుంచి సాధించారు. ఎస్‌ఎల్‌బీసీ ఎత్తిపోతల నుంచి నల్లగొండ ఉదయ సముద్రానికి నీరు చేరుతుంది. అక్కడి నుండి నీటిని లిఫ్ట్ చేసి నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు తరలిస్తారు. ఇందులో సొరంగ మార్గం పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిందే. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే మునుగోడు, నకిరేకల్‌తో పాటు నల్లగొండ నియోజకవర్గంలో కూడా సాగు, తాగు నీటిని ఇబ్బందులు ఉండవు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ
మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే మంజూరు చేశారు. భూ సేకరణతో పాటు నిధులు మంజూరు చేసి యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేయించారు.
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ
నల్లగొండలో వైఎస్ హయాంలోనే నల్లగొండకు అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ మంజూరయింది. కడప జిల్లా తర్వాత నల్లగొండ జిల్లాకే అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ మంజూరు చేశారు. ఆనాడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి ద్వారా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీని నల్లగొండకు మంజూరు చేయించారు. ఆయన తర్వాత ఆ ప్రాజెక్టు ఆగి పోయింది. నేటికీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తి కాని పరిస్థితి. ప్రధాన పనులన్నీ వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. దీంతో పాటు నల్లగొండలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా వైఎస్ హయాంలోనే మంజూరయింది. అంతకుముందు ప్రతి రోజూ రైళ్ల రాకపోకలతో గేట్లు పడడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ పరిస్థితుల్లో వైస్ దృష్టికి తీసుకెళ్లగా దాన్ని కూడా మంజూరు చేయించారు. కనగల్‌వాగుపై బ్రిడ్జి, నల్లగొండ మున్సిపల్ భవనం నిర్మాణం, రాంనగర్ పార్కులను అభివృద్ధి కూడా ఆయన కాలంలోనే జరిగింది. పట్టణ శివారులు రాజీవ్ గృహ కల్ప, నల్లగొండ పట్టణంలో మున్సిపల్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా వైఎస్సే శంకుస్థాపన చేశారు.
పేదలకు ఆయువు నిలిపిన ఆరోగ్య శ్రీ
వైఎస్ అధికారంలోకి రాగానే 2007లో ఆరోగ్యశ్రీకి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించి పేదల పాలిట దైవంగా నిలిచారు. తెల్ల రేషన్‌కార్డు ఉంటే చాలు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో గుండె జబ్బులతో పాటు ఇతర జబ్బులకు వైద్యం చేయించుకోవచ్చు.
104 సేవలు
104 సేవలు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు నేటికీ చేస్తున్నాయి. గ్రామాల్లో నిరక్షరాస్యులైన ప్రజలు షుగర్, బీపీ, తదితర దీర్ఘకాలిక రోగాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. 104 వాహనంలో డాక్టర్‌తో పాటు ల్యాబ్ టెక్నీషియన్, నర్సులు ఉంటారు. రోజూ ఒక గ్రామానికి వెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేసి షుగర్ బీపీ, టీబీ వంటి దీర్ఘ కాలిక రోగాలకు ఉచితంగా మందులు ఇస్తూ వస్తున్నారు. ప్రతి నెలా వైద్యం ఊరిలోనే అందే పరిస్థితి తీసుకొచ్చి పేద ప్రజలకు దేవుడయ్యారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.
జిల్లాతో ఎంతో అనుబంధం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి జిల్లాతో విడదీయలేని అనుబంధం. తెలుగుదేశం హయాంలో కరెంట్ కష్టాలు ఎన్నో ఉండేవి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథకాలకు శిలాపలకాలు వేసి ఏండ్లు గడిచినా వాటికి నిధులు విడుదల చేయని పరిస్థితి. దీంతో రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఎక్కడైతేశిలాపలకాలు ఉన్నాయో అక్కడ నిరసన మొక్కలు నాటుతూ వచ్చారు. అందులో భాగంగా నల్లగొండలోని పానగల్‌లో గల మహాత్మాగాంధీ పీజీ కళాశాలలో మొక్కలు నాటారు. ఆతర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లాకు 30 మార్లకు పైగానే రావడం జరిగింది.
108 సేవలు
వైఎస్ హయాంలోనే 108 సేవలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రులను తరలించడంలో 108 ప్రధాన భూమిక పోషించింది. ఎక్కడైనా, ఏ మనిషి ఆపదలో ఉన్నా 108కు ఫోన్ చేస్తే కుయ్యు... కుయ్యుమంటూ 5–10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆస్పత్రికి తరలిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. దీంతో వైఎస్ పేరు ప్రపంచ స్థాయిలో నిలిచింది.