మీ కోసం నేనున్నా..
ఖమ్మం : ‘ఏం పెద్దయ్యా.. బాగున్నావా..? అన్నా.. ఏం చేస్తున్నావు..? అక్కా అందరు మంచిగా ఉన్నారా..? తమ్ముడూ మంచిగా చదువుతున్నావా..? అంటూ అందరినీ పలుకరిస్తూ, వారి సమస్యలు వింటూ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నగరంలో పర్యటించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎంపీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఖమ్మం నగరంలోని సారథినగర్ నుంచి గాంధీచౌక్, గాంధీనగర్, పంపింగ్‌వెల్‌రోడ్డు ప్రాంతాల్లో పర్యటించారు. గోళ్లపాడు ఛానల్‌లో మురుగునీరు పేరుకుపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలతో మాట్లాడారు.
* ‘బిడ్డా.. గోళ్లపాడు కాల్వ చెత్తతో పూడుకు పోయింది.. మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరుగుతున్నాయి.. దుర్వాసనతో రోగాల పాలవుతున్నాం..’ అంటూ రాములమ్మ అనే వృద్ధురాలు ఎంపీకి తన బాధను విన్నవించింది.
* ‘అన్నా.. కాల్వలో మా బాబు పడిపోయాడు.. సమయానికి చూసి తీశాం కాబట్టి బతికిండు .. లేకపోతే చనిపోయేవాడు..’ అంటూ అచ్చిన వినోద అనే మహిళ ఎంపీ దృష్టికి తీసుకువచ్చింది.
* ‘ అన్నా.. రోడ్లు సరిగా లేవు.. ఇబ్బంది అవుతోంది.. రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడంతో మూడు కిలో మీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తోంది’ అంటూ ఎస్‌కే రహిమా అనే మహిళ, సారథినగర్ ప్రజలు చెప్పిన సమస్యలను ఎంపీ విన్నారు. అనంతరం గాంధీచౌక్‌లో హమాలీలతో మాట్లాడారు. వారి సమస్యలు విని ‘మీకు నేనున్నాన’ని భరోసా ఇచ్చారు.
ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడానికి గల కారణాలను మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని కాల్వలు, ఉప కాల్వల నిర్మాణంపై ఇంజనీరింగ్ అధికారుల వివరణ తీసుకున్నారు. కాల్వకు సంబంధించిన మ్యాప్ తెప్పించుకుని పరిశీలించారు. ఆయా ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వైఎస్సార్‌సీపీ నాయకులు ..ఎంపీకి వివరించారు. అనంతరం సారథినగర్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే ప్రదేశాన్ని పరిశీలించారు. రైళ్ల రాకపోకలతో గేట్ దాటేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
గోళ్లపాడు కాల్వలో పూడికతీత పనులు త్వరగా చేపడతామని, శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. రైల్వే అధికారులతో మాట్లాడి తర్వగా అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. సారథినగర్ నుంచి గాంధీచౌక్ చేరుకున్న ఆయన అక్కడ హమాలీలతో మాట్లాడారు. అక్కడి నుంచి గ్రెయిన్ మార్కెట్ రోడ్డు, శ్రీనివాసనగర్, ముస్తఫానగర్, జెడ్పీ సెంటర్ మీదుగా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.