హైదరాబాద్‌లో ‘వైఎస్సార్‌తో ఉండవల్లి అరుణ్ కుమార్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రోశయ్య. చిత్రంలో ఉండవల్లి, ఎమెస్కో విజయ్‌కుమార్, జస్టిస్ చలమేశ్వర్, కేవీపీ
సాక్షి, హైదరాబాద్: జీవితంలో చివరి క్షణం వరకు సమాజ క్షేమం, అందరిలో చెరగని చిరునవ్వును కోరుకున్న అరుదైన మహానాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కీర్తి తెలుగుజాతి ఉన్నంత వరకు నిరంతరం దేదీప్యమానమై నిలిచి ఉంటుందని ఆయనతో పని చేసిన నాయకులు, అధికారులు కీర్తించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రచించిన ‘వైఎస్సార్‌తో ఉండవల్లి అరుణ్ కుమార్ ’పుస్తకాన్ని మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ఆవిష్కరించి తొలి ప్రతిని వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు సతీమణి సునీతకు అందజేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రోశయ్య మాట్లాడుతూ వైఎస్‌తో తనకు రాజకీయాల్లోకి రాకముందు నుంచే మిత్రత్వం ఉందని, అదే స్నేహభావం చివరి క్షణం వరకు చెక్కు చెదరలేదన్నారు. వైఎస్ అంటే మంచి స్నేహితుడు, కల్లాకపటం లేనివాడు, ఓ అరుదైన మిత్రుడిగా చెప్పొచ్చని రోశయ్య అన్నారు.
రాజకీయాల్లో ఇంకా ఉండాల్సిన సమయం, వయసు ఉన్నా ఆయన దూరమవడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ సన్నిహితుడు కేవీవీ రామచంద్రరావు మాట్లాడుతూ 2004 మే 14న వైఎస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే ఆయనతో జ్ఞాపకాలను అందరితో పంచుకుంటున్నానని, 1966 నుంచి 2009 సెప్టెంబర్ 2 వరకు వైఎస్‌తో కలసి నడిచే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. వైఎస్, తాను అవిభక్త కవలలమని, వైఎస్‌కు తనతోపాటు అందరూ ఆత్మబంధువులేనని చెప్పారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలతో ఆయన నిజమైన పేదలకు మేలు చేశారన్నారు. దేశం గర్వించే అతికొద్ది మంది నాయకుల్లో రాజశేఖరరెడ్డి అగ్రగణ్యుడని కేవీపీ కితాబిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ వైఎస్‌తో తనకు తక్కువ సాన్నిహిత్యమే ఉన్నా ఆయన గొప్ప ప్రజానాయకుడన్నారు. తెలుగునాట ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రజానాయకులుగా ప్రజల్లో ముద్రపడ్డారన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజారంజక పాలన చేసే వారే చరిత్రలోనిలిచిపోతారని చలమేశ్వర్ అన్నారు.
మహానాయకుడాయన: మాజీ ఐఏఎస్‌లు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఓ మహానాయకుడు, గొప్ప విలక్షణ మనస్తత్వం ఉన్న నాయకుడని పుస్తకావిష్కరణలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మోహన్ కందా, రమాకాంత్‌రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావులు కితాబిచ్చారు. 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన తనకు తిరిగి వైఎస్ ప్రభుత్వంలోనూ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అరుదైన అవకాశం దక్కిందని మోహన్ కందా గుర్తుచేసుకున్నారు. వైఎస్ పాదయాత్ర అనుభవాలతో ఆరోగ్యశ్రీ లాంటి బృహత్తర పథక రూపకల్పన జరిగిందని, అందులో తామంతా భాగస్వాములం కావడం సంతోషకరమని మరో మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీలు ఎస్‌ఎస్‌పీ యాదవ్, అరవిందరావు, మాజీ ఐఏఎస్ ప్రభాకరరెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రాచమంద్రమూర్తి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌సతీమణి జ్యోతి, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ తదితరులు మాట్లాడగా ఎమెస్కో విజయ్‌కుమార్ సభకు సమన్వయకర్తగా వ్యవహరించారు.
మా అమ్మ ఆకాంక్షను వైఎస్ నెరవేర్చారు: ఉండవల్లి జ్యోతి
‘అరుణ్, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మా అమ్మానాన్న ఎంతో వ్యతిరేకించారు. అనేక మంది తాడూ, బొంగరం లేనివాడికి మీ అమ్మాయినిస్తారా అని వారిని ప్రశ్నించారు. రిటైర్మెంట్ తర్వాత పింఛన్ వచ్చే ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా చేయాలని అరుణ్‌కుమార్‌కు మా అమ్మానాన్న అనేకమార్లు సూచించినా ప్రభుత్వ ఉద్యోగం ఆయన వల్ల కాలేదు. రాజకీయాలంటేనే అమితంగా ఇష్టపడే అరుణ్ కుమార్‌ను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లిన ఘనత వైఎస్ గారిదే. మా అమ్మ కోరుకున్నట్లు ఈరోజు మాజీ ఎంపీగా పింఛన్ పొందుతున్నారు. ఈరోజు మా అమ్మా,నాన్నల ఆకాంక్ష వైఎస్, కేవీపీ వల్లే నెరవేరింది. వైఎస్సార్ అంటేనే ఒక భరోసా’ అని ఉండవల్లి జ్యోతి అన్నారు.
సునీత ప్రేరణతోనే పుస్తకం...
వైఎస్‌తో నాకున్న అనుబంధాన్ని పుస్తక రూపంలో తీసుకు రావడానికి ప్రేరణ.. కేవీపీ రామచందరరావు సతీమణి సునీత. వైఎస్ మరణాంతరం ఎప్పుడు కేవీపీ ఇంటికి వెళ్లినా వైఎస్సార్‌కు సంబంధించిన జ్ఞాపకాలే చర్చలో వచ్చేవి. వైఎస్‌తో జ్ఞాపకాలు పుస్తక రూపంలో తీసుకురావాల్సిందిగా ముందు కోరింది సునీత గారే. పుస్తకాన్ని అచ్చు వేస్తానని ముందుకు వచ్చింది ఎమెస్కో విజయ్‌కుమార్‌గారు. ఈ పుస్తకంలో నాకు వైఎస్‌తో ఉన్న అనుభవాలు, ఘటనలను ప్రస్తావించాను. నా విషయంలో వైఎస్ మంచివాడు, అంతకు మించినవాడు.
– ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ, పుస్తక రచయిత
Comments
Please login to add a commentAdd a comment