ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు కట్టుకున్న వారికి ఇప్పటి వరకు డబ్బులు రాలేదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బుధవారం
‘ఇందిరమ్మ’ బిల్లులు ఇప్పించండి
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు కట్టుకున్న వారికి ఇప్పటి వరకు డబ్బులు రాలేదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బుధవారం శాసనసభ జీవో అవర్‌లో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని లబ్ధిదారులు అప్పులు చేసి కట్టుకున్నారని, వాటికి వడ్డీలు పెరిగి పోతున్నాయి గాని ఇప్పటి వరకు బిల్లులు మాత్రం ఇవ్వలేదన్నారు.
పలు సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు
సత్తుపల్లి. అశ్వారావు పేట నియోజకవర్గాలను కలిపి సత్తుపల్లి జిల్లా చేయాలని సండ్ర వెంకట వీరయ్య, చేనేత, జౌళి శాఖలను వేరు చేసి విడివిడిగా నిధులు కేటాయిం చాలని సున్నం రాజయ్య, రాజీవ్ జాతీయ రహదారిలోని ఇంజనీరింగ్ లోపాలను సరి చేయాలని రసమయి బాలకిషన్, నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరవాలని విద్యాసాగర్ రావులు ప్రభుత్వాన్ని కోరారు. ఔట్ సోర్సింగ్ విధానంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, ఉద్యోగులు లేకుండానే ఉన్నట్లు చూపించి నిధులు దారిమళ్లిస్తున్నారని ఆర్. కృష్ణయ్య ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షం వేయాలని కిషన్‌రెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలో బీటీ రోడ్డు లేని 35 గ్రామాలకు బీటీ రోడ్డు సదుపాయం కల్పించాలని షిండే, కొండగల్ నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ సమస్యలను రేవంత్‌రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ నీళ్లు డిండి రిజర్వాయర్‌లోకి మళ్లించి దేవరకొండ దాహార్తిని తీర్చాలని రవీంద్ర కుమార్, కుడా పరిధి నుంచి సంగెం, ఆత్మకూరు, గీసుకొండ మండలాలను తొలగించాలని ధర్మారెడ్డి, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియంత్రిం చాలని భట్టి విక్రమార్క, ప్రభుత్వ మెడికల్ కాలేజీని మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో పెట్టాలని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కోరారు.